ప్రభుత్వం పేదలకు ఉచితంగా సరఫరా చేసే బియ్యాన్ని దొంగదారుల్లో కాజేసి.. అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటూ.. విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దందాలు ఘనంగా వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టు, విశాఖపట్నం పోర్టునుంచి బియ్యం అక్రమ స్మగ్లింగ్ దందాలను నడిపించడం మాత్రమే కాదు.. స్మగ్లింగ్ కు వీలుగా.. పీడీఎస్ బియ్యం నిల్వచేసే గోడౌన్ల కాంట్రాక్టు కూడా తమ పార్టీ వారే తీసుకుని దందా నడిపిస్తున్నట్టుగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా.. జగన్మోహన్ రెడ్డి అమాయకంగా మాట్లాడుతున్నారో, అజ్ఞానంతో మాట్లాడుతున్నారో తెలియదు గానీ.. ‘బియ్యం ఎగుమతుల్లో తప్పేముంది’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం చిత్రంగా కనిపిస్తోంది.
కాకినాడ పోర్టునుంచి జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్ వెనుక వైసీపీ నేతలు ఉన్నట్టుగా ఎన్నికలకు ముందునుంచి కూడా గుసగుసలు వ్యాప్తిలో ఉన్నాయి. తాజాగా మచిలీపట్నంలో పేర్ని నాని కి చెందిన పీడీఎస్ బియ్యం నిల్వ చేసే గోడౌన్ల నుంచి దాదాపు కోటిరూపాయల విలువైన బియ్యం మాయం అయినట్టుగా వస్తున్న వార్తలు స్మగ్లింగ్ దందాను ధ్రువీకరించేలాగా ఉన్నాయి. పరిస్థితులున్నీ వైసీపీ నేతల పాపాలనే వేలెత్తి చూపుతుండగా.. జగన్ మాత్రం.. బియ్యం ఎగుమతులు కొత్తేం కాదు.. అందులో తప్పేముంది.. ఈ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానంలో ఉంది అని అంటున్నారు.
అసలు జరుగుతున్న దందా గురించి జగన్ కు అర్థమవుతున్నదో లేదో అనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం రాష్ట్రమంతా మాట్లాడుకుంటున్నది బియ్యం స్మగ్లింగ్ గురించి మాత్రమే. ఎగుమతి గురించి కాదు. ఎగుమతి సాధారణమైన విషయం అనే సంగతి అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా పేరున్నది అయినప్పుడు.. ఇక్కడినుంచి బియ్యం ఎగుమతులు అత్యధికంగా జరగడం కూడా వింత కాదు. అయితే జరుగుతున్న స్మగ్లింగ్ దందా వేరు. తమ పార్టీ నేతలు సాగిస్తున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ బాగోతాన్ని.. అనుమతులతో జరిగే బియ్యం వ్యాపారం లాగా భ్రమింపజేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నది వాళ్లే కదా.. చెక్ పోస్టుల్ని దాటుకుని ఈ బియ్యం ఎలా వెళుతున్నాయి..? అని జగన్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు బొత్స వంటి వైసీపీ నేతలు కూడా బియ్యం స్మగ్లింగు జరుగుతోంటే.. విచారించి పట్టుకోండి అని సవాళ్లు విసురుతున్నారు. వీళ్ల అత్యుత్సాహం సంగతేమిటో గానీ.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ అయ్యేలా కాకినాడ పోర్టు దాకా ఎలా చేరుతున్నదో.. చెక్ పోస్టులను దాటించడానికి వైసీపీ నేతలు అనుసరిస్తున్న అడ్డదారులేమిటో సమస్త వివరాలూ విచారణలో వెలుగులోకి వస్తాయని.. పూర్తి ఆధారాలతోనే వారి భరతం పడతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
బియ్యం దొంగలను నెత్తిన పెట్టుకుంటున్న జగన్!
Thursday, December 12, 2024