తన మీద ఉన్న అవినీతి కేసుల నుంచి తన్నుతాను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో మంచి అవకాశం కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో వారికి సహకారం అందించడానికి జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. రాజ్యసభలో బిల్లు నెగ్గించుకోవడానికి చాలినంత మెజారిటీ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ప్రస్తుతం లేని నేపథ్యంలో- తమ పార్టీకి చెందిన ఎంపీలతో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలో ఎన్డీయే సర్కారుతో విభేదాలు ఎలా ఉన్నప్పటికీ కేంద్రంలోని మోడీతో కాస్త సాన్నిహిత్యం కొనసాగించవచ్చు నని ఆయన ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.
కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు ప్రస్తుతం వివాదాస్పదంగా ఉంది. మైనారిటీ సంఘాలు దీనిని దారుణంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ బిల్లు రాజ్యసభలో నెగ్గి బయటపడటం అసాధ్యం. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న రాజ్యసభ స్థానాల ఖాళీలు, జమ్మూ కాశ్మీర్ ఖాళీలను మినహాయిస్తే మొత్తం 229 ఓట్లు సభలో ఉంటాయి. ఈ నేపథ్యంలో బిల్లు నెగ్గాలంటే 115 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఎన్ డి ఏ కూటమికి దక్కగల మొత్తం ఓట్ల బలం 111 మాత్రమే. ఇంకా నాలుగు ఓట్లు వారికి అవసరం ఉంటాయి అయితే ఆ మేరకు రాజ్యసభలో బలం ఉన్న పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒరిస్సాలోని బిజీ జనతా దళ్ మాత్రమే. వైసీపీకి 11 సీట్లు ఉండగా బిజూ జనతాదళ్ కు 6 సీట్లు ఉన్నాయి.
ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో తీవ్రంగా విభేదించిన నవీన్ పట్నాయక్ ఈ బిల్లు విషయంలో ఎన్డీఏ సర్కారుకు సహకరిస్తారని అనుకోవడం భ్రమ. కేంద్రంలో తమ సహకారం ఇకపై కొనసాగదని ఆయన అప్పుడే విస్పష్టంగా ప్రకటించారు. అలాంటి ప్రకటన ఏదీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి రాలేదు. నిజానికి జగన్ కు అంత ధైర్యం కూడా లేదు. జగన్ మద్దతు అనేది కేంద్రానికి అనివార్యమవుతుంది. ఇలాంటి పరిస్థితి కోసమే వేచి చూస్తున్న జగన్ తనను జాగ్రత్తగా కాపాడేట్ట్లైతే.. బిల్లుకు మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదని ప్రతిపాదించాలని కోరుకుంటున్నారట. అయితే మైనారిటీలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుకు రాజ్యసభలో జగన్ మద్దతు ఇస్తే ఆ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని… అది పార్టీకి చేటు చేస్తుందని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒంటెత్తుపోకడలకు పేరు మోసిన జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
మోడీ ఎదుట సాగిలపడేందుకు జగన్ రెడీ!
Thursday, November 21, 2024