అవినాష్ రెడ్డిని వదిలించుకునే యోచనలో జగన్!

Sunday, December 22, 2024

నేనింతే సినిమాలో ఒక డైలాగు ఉంటుంది. ‘తుడుచుకుంటే పోతుందనుకుంటే.. నూటికి తొంభై తొమ్మిదిసార్లూ నేను తుడుచుకుంటాను. కానీ నేనే పోతాననుకుంటే.. ముందు నువ్వు పోతావ్’ అంటాడు హీరో రవితేజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచేన సరళి కూడా అలాగే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అడ్డగోలుగా కాపాడుతూ ఉంటే నడుస్తుంది అనుకున్నంత వరకూ కాపాడుతూనే వచ్చాడు. ఇప్పుడు తన మనుగడకే ప్రశ్నార్థకం అవుతుండగా.. తమ్ముడే అయినా సరే.. కాపాడడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? అనేది జనంలో వినిపిస్తున్న మాట. చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసులో సూత్రధారిగా, కీలకనిందితుడిగా ఉన్న తమ్ముడు అవినాష్ రెడ్డి విషయంలో తాను ఒక రక్షణకవచంలాగా నిలిచే పాత్ర నుంచి జగన్ నెమ్మదిగా తప్పుకోనున్నట్టుగా తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర బయటకు వచ్చిన తర్వాత జగన్ ఆయన కోసం చాలా కష్టాలు పడ్డారు. చాలాసార్లు ఢిల్లీ వెళ్లి అక్కడి భాజపా పెద్దలను అవినాష్ రెడ్డిని కేసునుంచి బయటపడేయాల్సిందిగా బతిమాలారు. అవినాష్ రెడ్డిని ఈ కేసు నుంచి కాపాడడం వెనుక జగన్ భార్య భారతి పాత్ర కూడా చాలా ఉందని చెబుతుంటారు. ఏదైతేనేం అవినాష్ ను వెనకేసుకు రావడానికి జగన్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

తీరా ఎన్నికల సమయంలో చెల్లెళ్లు షర్మిల, సునీత ఇద్దరూ కలిసి అవినాష్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల ప్రచారం సాగిస్తే.. జగన్ గట్టిగా ఎదురు నిలబడ్డారు. చెల్లెళ్ల మీదనే లేకి వ్యాఖ్యలుచేశారు. సొంత చెల్లెలు శీలాన్ని అవమానించేలా మాట్లాడారు. కన్నకూతురే హత్య చేయించినట్టుగా ప్రచారం చేయడానికి సాహసించారు. అదే వాదనతో కోర్టును కూడా నమ్మించేందుకు ప్రయత్నించారు. హత్య వెనుక చంద్రబాబునాయుడు ఉన్నారని సభల్లో ఆరోపించారు. మొత్తానికి కడపలో అవినాష్ రెడ్డి గెలిచారు.
కానీ ఓటమి తర్వాత పులివెందుల నియోజకవర్గానికి వెళ్లిన జగన్ సమక్షంలోనే అవినాష్ రెడ్డిని స్థానిక నాయకులంతా కలిసి ‘నీ వల్లనే వైఎస్ కుటుంబానికి ఇలాంటి దుస్థితి వచ్చిందంటూ’ నిందించడం జగన్ దృష్టికి వచ్చిందట. పార్టీ ఓటమికి అవినాష్ ఒక ప్రధాన కారణం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవినాష్ ను కాపాడే ప్రయత్నంలో తన పార్టీ, తన సొంత మనుగడ సర్వనాశనం అవుతోందనే భయం ఆయనలో మొదలైనట్టు తెలుస్తోంది. పులివెందులలో కనీసం అయిదురోజులు ఉండలేక బెంగుళూరు పయనం అయిన జగన్.. అవినాష్ కు రక్షగా నిలవాలనే ఆలోచన మానుకున్నట్టు తెలుస్తోంది. కడపలో వినిపిస్తున్న ఈ ప్రచారం నిజమైతే.. త్వరలోనే అవినాష్ రెడ్డి అరెస్టు కూడా ఉంటుందని అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles