మొన్నమొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి తరఫున పనిచేసే కిరాయిదళాలన్నీ మితిమీరిన గోల చేశాయి. సూపర్ సిక్స్ హామీలు ఇంకా అమలు చేయలేదు. పెండింగు ఉన్నాయి. మహిళలకు బస్సు ప్రయాణం కూడా అమలు చేయలేదు.. అంటూ నానా యాగీ చేశారు. తీరా ఇప్పుడు కూటమి సర్కారు ఉచిత బస్పు ప్రయాణంను కార్యరూపంలోకి తెచ్చింది. మహిళల సొంత జిల్లాకు మాత్రమే ఉచితం అని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రమంతా వర్తించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మహిళల్లో సంతోషం వెల్లువెత్తుతోంది. అదేసమయంలో సాక్షి మరియు జగన్ దళాలు మాత్రం మరింతగా విషం కక్కుతున్నాయి. డీలక్స్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అనుమతించడం లేదనేది వారి ఏడుపుగా ఉంది. అయితే.. మహిళలోకం మొత్తం ఆదరిస్తున్న ఈ స్త్రీశక్తి పథకం పట్ల ఇలాంటి కపట విలాపాలు కొనసాగిస్తే.. రాష్ట్రంలోని మహిళాలోకం జగన్మోహన్ రెడ్డినే మరింతగా ఛీత్కరించుకునే ప్రమాదం ఏర్పడుతుందని.. ఆ పార్టీ వర్గాలే భయపడుతున్నాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పించడం ద్వారా.. వారి ఉపాధులు మెరుగుపడాలని, ఇరుగు పొరుగు ప్రాంతాలకు వెళ్లి.. కాస్త రాబడి ఉన్న ఇతర ఉద్యోగాలు కూడా చేసుకోగలరనేది చంద్రబాబునాయుడు ఆశించిన లక్ష్యం! కేవలం మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడడమే ఉద్దేశ్యం. ఈ పథకం వల్ల ఆయన ఆశించిన ప్రయోజనం ఎంత గొప్పగా నెరవేరుతుందో.. ప్రారంభించిన రోజునే సంకేతాలు కనిపించాయి.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించి ప్రయాణించిన బస్సులో కొందరు మహిళలు కూడా ప్రయాణించారు. వారిలో ఒక మహిళ.. ఈ పథకం తనజీవితంలో ఎంత మార్పు తెస్తుందో స్వయంగా చంద్రబాబుకు చెప్పుకుంది.
ఆమె, తన భర్తతో కలిసి చేపలు వ్యాపారంతో జీవిస్తున్నది. ప్రతిఉదయం ఇద్దరూ చెరొక ఊరికి వెళ్లి ఆ చేపలను అమ్ముకుని జీవిస్తుంటారు. ఇద్దరూ కలిసి రోజుకు 500 వరకు సంపాదిస్తుంటారు. ఇప్పుడు ఉచిత ప్రయాణ అవకాశం వలన రోజుకు కనీసం వంద రూపాయలు తనకు మిగులుతాయని ఆ మహిళ చెప్పుకొచ్చింది.
రోజుకు 500 సంపాదించే వారికి అందులో 20 శాతం అంటే వందరూపాయలు మిగలడం అంటే చిన్న విషయం ఎంతమాత్రమూ కాదు. ఆ మిగిలే సొమ్మును జాగ్రత్తగా వాడుకుంటే, పొదుపు చేసుకుంటే వారి జీవితాల్లో ఖచ్చితంగా కొత్త వెలుగులు వస్తాయి. చంద్రబాబునాయుడు సర్కారు ప్రధానంగా ఈ వర్గాన్ని ఉద్దేశించి, తమ జీవితాలను మెరుగుపరచుకునే వారికోసం ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. జగన్ దళాలు విలపిస్తున్నట్టుగా.. శ్రీకాకుళంలో బస్సు ఎక్కి తిరుపతిలో దేవుడి గుడికి వెళ్లాలనుకునే వారూ, కుప్పంలో బస్సు ఎక్కి విశాఖపట్నం విహారయాత్రకు వెళ్లాలనుకునే వారి కోసమూ కాదు. అలా వెళ్లాలనుకున్నా కూడా.. ఇప్పటికీ కుదురుతుంది. కాకపోతే ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే వెళ్లాలి. అందుకు సుముఖంగా ఉండే మహిళలు కూడా బోలెడు మంది ఉంటారు. కానీ.. చంద్రబాబు మహిళలను మోసం చేశాడని, వంచించాడని రకరకాలుగా విషం కక్కుతూ జగన్ దళాలు చేస్తున్న ప్రచారం చవకబారుగా ఉంది. చంద్రబాబు హామీ ఇచ్చినది అసలు ఒకజిల్లా పరిధికి మాత్రమే అనేది వారు కావాలనే మరుగున పెట్టి ఇలా బురద చల్లుతున్నారు. ఇంత కుటిలత్వం ప్రదర్శించే కొద్దీ.. ఉచిత ప్రయాణం వల్ల లబ్ధిపొందే కోట్లాది మంది మహిళలు జగన్ ను అసహ్యించుకుంటారని ప్రజలు భావిస్తున్నారు.
జగన్! దొంగ ఏడుపులు మానకుంటే.. మహిళలే ఛీ కొడతారు!
Friday, December 5, 2025
