ఎక్కడైనా సరే ఎన్నికల్లో అందరికంటె ఆలస్యంగా తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించే వారికి ఒక ఎడ్వాంటేజీ ఉంటుంది. మిగిలిన పార్టీలు ఎలాంటి హామీలను ప్రకటించాయో జాగ్రత్తగా గమనించుకుని, వాటిని తలదన్నేలా పెద్ద హామీలను వారు ప్రకటించవచ్చు. ఆ రకంగా ఎడ్వాంటేజీ తీసుకోవాలని అందరూ అనుకుంటారు. గత 2019 ఎన్నికల సమయంలో జగన్ కూడా అలాటి పనే చేశారు. 2000 పింఛను ను చంద్రబాబు అమలు చేసేసిన తర్వాత.. తాను 3000 చేస్తానంటూ ప్రకటించి మైలేజీ తీసుకున్నారు. ఈ ఏడాది కూడా చంద్రబాబు చాలా హామీలను ప్రకటించేసిన తర్వాత.. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో తీసుకువచ్చారు. అయితే తమాషా ఏంటంటే.. ‘చంద్రబాబు ప్రకటించిన హామీల స్థాయిలో చేయను, అంతకంటె తక్కువే చేస్తా.. కానీ మీరందరూ ఓట్లు మాత్రం నాకే వేయండి.. నన్నే మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి’ అంటున్నట్టుగా జగన్ మేనిఫెస్టో అంశాలు ఉన్నాయి.
ప్రధానంగా పింఛను సంగతి చూడాలి. ప్రస్తుతం లబ్ధిదారులకు మూడువేల రూపాయల పింఛను అందుతోంది. దీన్ని మూడున్నర వేలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఎప్పుడు పెంచుతారు? ఇంకా మూడేళ్లు వెయిట్ చేయాలంట. 2028 జనవరిలో 250, 2029 జనవరిలో 250 పెంచుతారట. 2029 ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు బిస్కట్ వేయడానికా అన్నట్టుగా ఆ పెంపు కనిపిస్తోంది కదా.
అయితే పింఛను విషయంలో చంద్రబాబు చెబుతున్నది ఏమిటి? ఆయన 3000 పింఛనును ఏకంగా 4000 చేస్తానని అన్నారు. అది కూడా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని ముందే ప్రకటించేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. అంటే జూన్ లో ప్రభుత్వం ఏర్పడితే గనుక.. జులైలో అందించే రూ.4000 పింఛనుతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి అదనంగా 3000 పింఛను అరియర్స్ కూడా అందిస్తాం అని చంద్రబాబు చాలా ధీమాగా ప్రకటించారు. అసలు చంద్రబాబు హామీతో పోలిస్తే.. జగన్ హామీ ఎందుకూ పనికి రాని హామీ అని చెప్పాలి.
ఇలాంటిదే మరొకటి కూడా ఉంది.. అన్నదాతలకు మరో పేలవమైన హామీని జగన్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. రైతు భరోసాను ప్రస్తుతం ఉన్న 13500 నుంచి 16000కు పెంచుతానని ప్రకటించారు. అయితే చంద్రబాబునాయుడు ఇప్పటికే రైతులకు ఏడాదికి 20 వేల సాయం అందిస్తానని ప్రకటించి ఉన్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు కంటె తక్కువ మొత్తం ఇచ్చేలా జగన్ తన వరాలను ఇవ్వడం విశేషం.
బాబు చేస్తానంటున్న మేలుకంటే.. నేను తక్కువ మేలు మాత్రమే చేస్తా.. కానీ మీ ఓట్లు మాత్రం నాకే వేయండి- అని జగన్ అడుగుతున్నట్లుగా ఈ మేనిఫెస్టో ఉంది. మరి దీనికి ప్రజలు ఏమాత్రం ఆకర్షితులు అవుతారో ఏమో వేచిచూడాలి.
జగన్ : బాబుకంటె తక్కువ చేస్తా.. నన్నే గెలిపించండి!
Tuesday, January 21, 2025