జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ప్రభుత్వ ఖజానాకు దక్కవలసిన నిధులను అడ్డగోలుగా దోచుకోవడానికి రెండు ప్రధాన మార్గాలను ఎంచుకున్నారు. వాటిలో ఒకటి ఇసుక విక్రయాల్లో కొత్త విధానం తీసుకురావడం కాగా, రెండోది మద్యం విక్రయాల్లో తీసుకువచ్చిన కొత్త విధానం. విధానంలో లోటుపాట్ల సంగతి పక్కన పెడితే.. ఈ రెండు ప్రభుత్వ వ్యాపారాల్లోనూ డిజిటల్ లావాదేవీలకు అవకాశమే లేకుండా చేయడం ద్వారా.. విచ్చలవిడి దోపిడీకి రాజమార్గం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు రకాల వ్యాపారాల ద్వారా దాదాపు యాభైవేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వఖజానాకు రావాల్సిన సొమ్ము దారి మళ్లినట్టుగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు తేలుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు కాగా.. జగన్ మార్కు దోపిడీకి చరమగీతం పాడడానికి ఇప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ చేసిన ద్రోహాలను ఒక్కటొక్కటిగా చక్కదిద్దుతూ కొత్త ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇసుకదోపిడీని అరికట్టి ఆల్రెడీ కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నారు. కేవలం పంచాయతీలకు జమ అయ్యే సీనరేజీ చార్జీలు మాత్రం వసూలుచేస్తూ ప్రజలకు ఇసుకను ఉచితంగానే అందుబాటులో ఉంచుతున్నారు. ఆ దోపిడీకి ఫుల్ స్టాప్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలో జగన్ మార్క్ దోపిడీకి కూడా ఇవాళ్టితో తెరపడనుంది.
రాష్ట్రంలో 3396 మద్యం దుకాణాలకోసం ఏకంగా 89882 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని చో ట్ల సంఖ్యాపరంగా తక్కువ దరఖాస్తులే వచ్చినప్పటికీ.. మొత్తం వచ్చినవాటిని గమనించినప్పుడు ఒక్కో దుకాణానికి సగటున 25 అప్లికేషన్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. నాన్ రీఫండబుల్ ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. మద్యం షాపుల కేటాయింపు కూడా పూర్తయిన తర్వాత దక్కే ఆదాయం అనూహ్యంగా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించే పద్ధతి తీసుకువచ్చారు. ప్రభుత్వం పరంగా చేయాల్సిన అభివృద్ధి పనులు చేయకుండా.. వ్యాపారుల పొట్టకొట్టేలా లిక్కరు, చేపలు తదితర వ్యాపారాలు ప్రభుత్వం చేసేలా పద్ధతులు మార్చారు. నిజానికి ఆయన అసలు కుట్ర ప్రభుత్వ వ్యాపారం కాదు. ప్రభుత్వ దుకాణం ముసుగులో.. డిజిటల్ లావాదేవీలు కూడా అనుమతించకపోతే.. రెండో కంటికి తెలియకుండా విచ్చలవిడిగా దోచుకోవడం సాధ్యమవుతుందనే కోరిక మాత్రమే. ఆ ప్రకారమే వారు దోచుకుంటూ వెళ్లారు. కానీ ఆ దోపిడీకి ఇప్పుడు చంద్రబాబు చెక్ పెట్టేశారు.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 14వ తేదీన లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నారు. 15వ తేదీన వారికి దుకాణాలను అప్పగించేయబోతున్నారు. అక్కడితో.. జగన్ దోపిడీకి చరమగీతం పాడినట్లవుతుందని లిక్కర్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం అన్ని రకాల పాపులర్ బ్రాండ్లు కూడా అందుబాటులోకి రావడం, లిక్కర్ ధర తగ్గించడం కూడా వారికి సంతోషం కలిగిస్తోంది.