జగన్ కు మర్రి షాక్ : బేరాలు, బుజ్జగింపులకు నో! 

Tuesday, December 9, 2025

జగన్మోహన్ రెడ్డికి ఎంతో విధేయుడు అయినటువంటి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ అధినేతకు షాక్ ఇచ్చారు. ఏపీ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న బలం క్రమక్రమంగా పలచబడుతూ ఉండగా.. తాజాగా మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా సమర్పించడం జగన్ కు షాకే! తన సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు వెళ్లిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తానని, తన అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించుకున్న తరువాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మర్రి అంటున్నారు. అయితే ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. 

 జగన్ వాడుకుని వదిలేసిన, జగన్ మాటలకు మోసపోయిన ఆ పార్టీలోని అనేకమంది సీనియర్ నాయకుల్లో మర్రి రాజశేఖర్  కూడా ఒకరు. 2014లో చిలకలూరిపేటలో ఆయన వైసీపీ తరఫున ఓడిపోయారు. 2019లో జగన్ టికెట్ మాత్రం ఇవ్వలేదు. కొంత కాలం కిందటే పార్టీలో చేరిన విడదల రజనికి టికెట్ ఇచ్చారు. మర్రికి మంత్రి పదవి ఇస్తానంటూ ఊరించారు. అప్పటికి అలకపూనిన ఆయనను ఆ మాయమాటలతో ఊరడించారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే.. జగన్ అధికారంలోకి రాబోతున్నాం అనే నమ్మకంతో.. ధైర్యంగా ఇద్దరికి మాత్రమే ప్రచార సభల్లోనే మంత్రి పదవులు ప్రకటించారు. వారిలో మొదటివారు మర్రి రాజశేఖర్ కాగా, రెండోది ఆళ్ల రామక్రిష్ణారెడ్డి. అధికారం దక్కిన తర్వాత ఈ ఇద్దరికీ హ్యాండిచ్చారు.  కనీసం పునర్ వ్యవస్థీకరణ సమయంలోనైనా అవకాశం దక్కుతుందని ఆశించిన మర్రికి భంగపాటు ఎదురైంది.

పోనీ 2024లో టికెట్ ఇస్తారని ఆశిస్తే మర్రికి అది కూడా దక్కలేదు. విడదల రజని పట్ల నియోజకవర్గంలో అసమ్మతి ఉందని గ్రహించి.. ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారు తప్ప.. మర్రికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. తీరా ఎన్నికలలో ఓటమి తర్వాత.. విడదల రజనినే వెనక్కు తీసుకువచ్చి పేట ఇన్చార్జి బాధ్యతలను ఆమె చేతిలో పెట్టారు. ఇవన్నీ తీవ్రమైన అవమానాలుగా మర్రి రాజశేఖర్ భావించడం జరిగింది. అప్పటినుంచి ఆయన మనస్తాపంతో రగిలిపోతూ.. పార్టీని వీడి తెలుగుదేశంలో  చేరాలని అనుకుంటున్నట్టు పుకార్లు వచ్చాయి. ఆయన అసంతృప్తిని గ్రహించి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఆయన పట్టించుకోలేదు. బొత్స తదితరుల మాటలకు కూడా విలువ ఇవ్వలేదు. ఆ రకంగా ఆయన ఎమ్మెల్సీ పదవిని వీడడం, పార్టీకి కూడా గుడ్ బై చెప్పడం జరిగిపోయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles