పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద అనుమానాలు సృస్టించడానికి జగన్మోహన్ రెడ్డి నానా కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేశారంటూ.. వైసీపీ నానా గోల చేస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ఎత్తు తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ.. వరుస నిందలతో, అబద్ధాలతో అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలందరూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల జరిగే నష్టాన్ని పార్లమెంటులో వివరించాలని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తిచేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించడం పెద్ద కామెడీగా కనిపిస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి తన ఎంపీలకు ఇలంటి సూచన చేయడానికంటె ఒక రోజు ముందే శాసనసభలో నీటివనరుల గురించి చర్చ జరిగింది. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో నీటివనరుల పరంగా ఏయే ప్రాజెక్టులు చేపట్టబోతున్నామో చంద్రబాబునాయుడు చాలా విపులంగా సభకు వివరించారు. 55 వేల కోట్ల రూపాయలతో 45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం అని చంద్రబాబునాయుడు విస్పష్టంగా ప్రకటించారు. సభకు డుమ్మా కొట్టి ఇంట్లో కూర్చొన్న జగన్మోహన్ రెడ్డికి బహుశా చంద్రబాబు ముందే ఎత్తును ధ్రువీకరించిన సంగతి తెలియదేమో అని జనం నవ్వుకుంటున్నారు. ఒకవైపు చంద్రబాబు అదే ఎత్తుతో నిర్మాణం చేస్తాం అని చెబుతుండగా.. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఆ ఎత్తు కోసం పార్లమెంటులో పోరాడాలని తన ఎంపీలకు దిశానిర్దేశం చేయడం పెద్ద కామెడీగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.
జగన్ కు అంతా తన ఘనతగానే చాటుకోవాలనే ఉబలాటం ఎక్కువగా ఉన్నట్టుందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. చంద్రబాబునాయుడు ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తిచేసినా సరే.. అది కేవలం తాను డిమాండ్ చేయబట్టి మాత్రమే జరిగిందని, తన పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడడం వల్ల మాత్రమే జరిగిందని చాటుకోవడానికి ఆయన ఉత్సాహపడుతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. జగన్ అయిపోయిన నిర్ణయాల గురించి ఇప్పుడు డిమాండ్లు లేవనెత్తే కామెడీలు చేయకుండా.. నిజమైన ప్రజాసమస్యల గురించి పోరాడితే.. ఆయనకు భవిష్యత్తు ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్ డ్రామా : క్రెడిట్ కావాలా నాయనా?
Wednesday, January 22, 2025