పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన భార్య వైఎస్ భారతి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో వింతేముంది. భర్త ఎన్నికల్లో పోటీచేస్తుంటే భార్య ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం మామూలే కదా అనుకుంటున్నారా? కానీ అక్కడే ఉంది ట్విస్టు. వైఎస్ భారతికి తమకు అపారమైన పట్టు ఉన్న సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీకే చెందిన, సొంత కులానికే చెందిన నాయకుల నుంచి అనుకోని షాక్ లు ఎదురవుతున్నాయి. చాలా దూకుడుగా ఇంటింటికీ తిరుగుతున్నా.. ఒక వైసీపీ నాయకుడు ఇచ్చిన షాక్ కు ఆమె సైలెంట్ అయిపోయారు.
ప్రచారంలో భాగంగా భారతి వేంపల్లెలో గొర్లమందల కాలనీలోని ఒక మాజీ సర్పంచి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఫ్యానుకు ఓటేయాలని అడుగుంతుండగా.. మాజీ సర్పంచి భర్త భాస్కర రెడ్డి భారతిని నిలదీస్తూ.. తాతముత్తాతల కాలంనుంచి వారసత్వంగా మాకు వస్తున్న భూములకు సంబంధించిన పట్టా పుస్తకాల మీద జగన్ బొమ్మ ఎందుకు ముద్రించి ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. పాసుపుస్తకాలమీద రైతుల బొమ్మలు ఉండాలే తప్ప జగన్ వి కాదు అని ఆమెకు హితవు చెప్పారు. ఆ మాట జగన్ కు చెప్పాలని సలహా కూడా ఇచ్చారు. సొంత పార్టీ నాయకుడే ఇలా ప్రశ్నించడంతో భారతికి నోటమాట రాలేదు. ఆమె షాక్ తో సైలెంట్ గా ఉండిపోయారు.
భాస్కర రెడ్డి అంతటితో ఊరుకోలేదు. ప్రతి సభలోనూ జగన్ నాఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఉంటారే.. ఒక్క సభలో ఒక్క నాడైనా నా రైతన్న అనే పదం వాడారా? అని కూడా భారతిని నిలదీశారు. రైతుభరోసా కింద అందిస్తున్న మొత్తంలో సగం డబ్బు కేంద్రప్రభుత్వానిదే కదా అని కూడా భారతిని ప్రశ్నించారు.
సొంత పార్టీ నాయకుడు షాకుల మీద షాకులు ఇస్తోంటే భారతి నోట మాటరాక మౌనంగా ఉండిపోవడం విశేషం. ఇంత ఘాటైన షాకులు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలనుంచి .. అది కూడా పులివెందుల నియోజకవర్గంలో ఎదురైతే జగన్, భారతి తట్టుకోగలరా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
జగన్- భారతి ఈ షాక్‌ను తట్టుకోలేరేమో?
Sunday, December 22, 2024