కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గద్దె ఎక్కబోతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే తమ భరతం పడతారనే భయం ఇప్పుడు చాలామంది అధికారుల్లో ఉంది. వారందరూ హఠాత్తుగా పలాయనమంత్రం పఠిస్తున్నారు. తమ హోదాలను వదులుకుంటున్నారు. సెలవుపెట్టి పరారవుతున్నారు. రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వంలో ఉంటూ చంద్రబాబు కళ్లపడకూడదని మాత్రం కోరుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయించడం, చంద్రబాబును అరెస్టు చేయడం తదితర వేధింపు వ్యవహారాలలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై అమెరికా వెళుతున్నారు. బుధవారం నుంచి జులై 3వ తేదీ వరకు ఆయన అమెరికా వెళ్లడానికి సెలవు పెట్టేశారు. మంగళవారం ఫలితాల సరళి అర్థం కాగానే.. ఆయన పలాయనానికి వీలుగా సెలవుపెట్టడం, జగన్ కు అధికార యంత్రాంగంలో ఉన్న అందరికంటె గొప్ప భక్తుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆ సెలవును వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి.
సీఐడీ ఏడీజీ సంజయ్ మాత్రమే కాదు. ఇంకా పలువురు అదేబాటలో ఉన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు జగన్ కోసం న్యాయస్థానాల్లో వాదించిన వారిలో కొందరు తమ రాజీనామా లేఖలను అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ కు అంజేసేశారు. తీరా ఏజీ శ్రీరామ్ కూడా తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు.
మరోవైపు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా ఉన్నటువంటి హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఆలేఖను శాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావుకు పంపారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం లేకపోవడం వల్ల, ఆయన దానిని ఆమోదించకుండా, బుధవారం నుంచి జూన్ 19 వరకు ఆయనకు మెడికల్ లీవ్ మంజూరు చేశారు.
జగన్ భక్తిని ప్రదర్శించుకుంటూ.. చంద్రబాబు పట్ల, రాజకీయ ప్రత్యర్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ వచ్చిన అధికార గణాలు అందరికీ ఇప్పుడు భయం పట్టుకుంటోంది. తమ మీద బెత్తం ఝుళిపించే వరకు ఆగకుండా ముందే తప్పించుకోవడం ఎలాగ అనే మార్గాల అన్వేషణలో ఉన్నారు. జగన్ తాను పరిపాలించిన అయిదేళ్ల కాలంలో.. అధికార యంత్రాంగాన్ని మొత్తం తన భక్తులతో, వీర విధేయులతో నింపేసిన సంగతి తెలిసిందే. వారందరికీ ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
పలాయనం బాటలో జగన్ భక్త అధికారులు!
Wednesday, January 22, 2025