తాను గిఫ్ట్ డిడి కింద ఇచ్చిన కంపెనీ షేర్లను బదిలీ చేయడం ద్వారా తన బెయిల్ రద్దు చేయించడానికి కుట్ర జరుగుతున్నదని జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా పెద్ద జోక్ అని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. బెయిల్ రద్దుకు కుట్ర అని జగన్ అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. ఆస్తులపై వ్యామోహంతో రక్తసంబంధం అనుబంధాలను మార్చివేశారని కుటుంబ విషయాలను రోడ్డుమీదికి తీసుకువచ్చారని ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారని షర్మిల ఆరోపించారు. నిజం చెప్పాలంటే సరస్వతీ కంపెనీ షేర్లను ఈడి అటాచ్ చేయలేదు షర్మిల వివరించారు.
షర్మిల పేర్కొన్న వివరణలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల అబద్ధాలు చెప్పి తల్లి చెల్లి మీద ట్రిబ్యునల్ కేసు బనాయించారో అర్థమవుతుంది. చెల్లెల్లి మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనే మాట పెద్ద అబద్ధం అని ఆమె అంటున్నారు. రూ.32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే ఈ డి అటాచ్ చేసిందని, అంతే తప్ప కంపెనీ షేర్లను ఎప్పుడూ అటాచ్ చేయలేదు అనే వాస్తవాన్ని ఆమె వివరిస్తున్నారు.
2016లో ఈడీ అటాచ్ చేసినందున షేర్ల బదిలీ చేయకూడదని జగన్ వాదిస్తున్నారు కానీ 2019లో 100 శాతం వాటాలు బదలాయిస్తామని ఎలా సంతకం చేశారు? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. 2021లో షేర్లు కొనుగోలుకు ఎలా అనుమతిచ్చారు అనేది ఆమె ప్రశ్న! షేర్లను 42 కోట్ల రూపాయలకు కొనడానికి తల్లికి అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. 2021 లోని జగన్ అతని భార్య షేర్లను వైఎస్ విజయమ్మ పేరిట గిఫ్ట్ ఇవ్వడాన్ని కూడా షర్మిల ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సరస్వతీ కంపెనీ షేర్లను వదులుకోవడం జగన్ కు ఇష్టం లేకుండా పోయిందని అందుకే ఈడి అటాచ్మెంట్ అంటూ కొత్త డ్రామా ప్రారంభించారని షర్మిల అంటున్నారు. మొత్తానికి అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తులు తగాదా ఇంకా ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.