మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కొద్ది కాలం కిందట ప్లాన్ చేసుకుని, పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ జనసమీకరణకు వీలు కుదరక చివరినిమిషంలో వాయిదా వేసుకున్న నెల్లూరు పరామర్శ యాత్రకు ఇప్పుడు ముహూర్తం పెట్టుకున్నారు. ఈనెల 31న ఆయన నెల్లూరు వెళ్లడానికి కార్యక్రమం నిర్ణయం అయింది. వందల కోట్ల రూపాయల క్వార్ట్జ్ మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన కాకాణి గోవర్దన రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. ఆయనతో ములాఖత్ కావడానికి జగన్ వెళుతున్నారు. కాగా.. జగన్ గత పర్యటనల సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో.. ఈసారి పోలీసులు ఇంకా గట్టి ఆంక్షలు విధించారు. వాటిని ఆయన ఏమేరకు పాటిస్తారు.. ఏమేరకు పోలీసుల్ని రెచ్చగొట్టడానికి మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడతారు.. అనేది వేచిచూడాల్సి ఉంది.
జులై 3న నెల్లూరు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నప్పుడు ఆయన షెడ్యూలులో కాకాణి ములాఖత్ ఒక్కటే ఉంది. కానీ ఇప్పుడు మరో కార్యక్రమం కూడా జత చేరింది. నెల్లూరు జిల్లాలో తన పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోవడానికి ఒక కారణంగా నిలిచిన వేమిరెడ్డి కుటుంబంపై పగ తీర్చుకోవడం కూడా ఆయన షెడ్యూలులో జత కలిసింది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అత్యంత నీచంగా, అసభ్యంగా బూతులు తిట్టిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఇంటికి వెళ్లి పరామర్శించాలని జగన్ నిర్ణయించుకున్నారు. మామూలుగా అయితే.. జగన్ జైలు వద్దకు ములాఖత్ కు వచ్చినప్పుడు.. ప్రసన్నకూడా అక్కడకు వస్తే సరిపోతుంది. మీడియాతో మాట్లాడే సందర్భంలో ఆయన గురించి కూడా జగన్ నాలుగు ముక్కలు మాట్లాడేస్తారు. కానీ.. నెల్లూరు సంచలనం చేయాలి, అల్లర్లు జరగాలి.. కార్యక్రమం ఒకేచోట కాకుండా.. సుదీర్ఘంగా సాగాలి అనే దురాలోచనలతోనే జగన్ ఇలాంటి ప్లాన్ చేసినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు జగన్ ప్రతి కార్యక్రమాల్లోనూ జరుగుతున్న విధ్వంసం, ఆస్తుల నష్టం తదితరాల నేపథ్యంలో నెల్లూరు పోలీసులు కూడా గట్టిగానే ఆంక్షలు విధించారు. ఆయన వెంట కాన్వాయ్ తో పాటు పదిమందికి మించి రావాడానికి వీల్లేదని అనుమతుల్లో పేర్కొన్నారు. నిజానికి జగన్ కు కావాల్సింది కూడా ఇలాంటి ఆంక్షలే. పోలీసుల్ని ఆడిపోసుకోవడానికి, నానా మాటలు తిట్టడానికి ఇలాంటి ఆంక్షలు ఉపయోగపడతాయనేది వాటి కోరిక. పోలీసులు విధించిన ఆంక్షలను పాటించే మంచితనం జగన్ లో ఏనాడూలేదు. వాటిని ఉల్లంఘించడం, పోలీసులను ప్రభుత్వాన్ని కవ్వించడమే తన ప్రధాన ఎజెండా అన్నట్టుగా జగన్ ప్రతిసారీ వ్రవర్తిస్తూ ఉంటారు. ఈసారి కూడా నెల్లూరులో అలాంటి కవ్వింపులే జరగాలని ఆయన కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
జనం వెల్లువెత్తే జగన్ కార్యక్రమాలకు పదిమంది మాత్రమే రావాలని ఆంక్షలు పెడతారా? అంటూ అప్పుడే వైసీపీ దళాలు సూటిపోటి మాటలు ప్రారంభించారు. అయితే.. భారీగా జనసమీకరణ ద్వారా.. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి.. శాంతి భద్రతల్లో పోలీసులు విఫలం అయ్యారని చాటిచెప్పడం లక్ష్యంగా వైసీపీ దళాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరోసారి కవ్వింపు చర్యలకు రెడీ అవుతున్న జగన్ అండ్ కో!
Friday, December 5, 2025
