ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి భక్తి, అతి విధేయత సదా కనపరుస్తూ ఉంటారు. ఆయన కనపడగానే వంగి పాదాలకు ప్రణమిల్లుతారు. వీరభక్తిని చూపిస్తారు. ఇవన్నీ మనకు వీడియో కెమెరాల సాక్షిగా కనిపించే వాస్తవాలు. అదే సమయంలో మోడీతో అపాయింట్మెంట్ దొరికినప్పుడు తన ఎజెండాలోని అంశాలన్నింటినీ వెళ్ళబోసుకుంటారు. ఆయన దయ, కరుణ అభ్యర్థిస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్నది ఇదే. మోడీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలలో జగన్మోహన్ రెడ్డి ఎజెండా అంశాలు ఏమిటి అనేదే ప్రస్తుత చర్చినీయాంశం!
మోడీని కలిసే సందర్భాలలో జగన్ ప్రత్యేకంగా ఆయనతో ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. కానీ భేటీ ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత.. స్వయంగా మీడియాని ఎదుర్కొని వారితో మాట్లాడే అలవాటు లేని జగన్ తరఫున, ఒక ప్రెస్ నోట్ మాత్రం విడుదల అవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా దగ్గర నుంచి, పోలవరం నిధులు, విభజన సమస్యలు, ఇవన్నీ కూడా జగన్ మోడీతో ప్రస్తావించినట్లుగా ఆ ప్రెస్ నోట్ మనలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనతో కలిసి పాల్గొన్న ఏ వేదిక మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల పట్ల తన చిత్తశుద్ధిని ప్రదర్శించిన దాఖలాలు లేవు గాక లేవు! ఏ సభలోనూ బహిరంగంగా ‘మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి’ అనే మాటను జగన్ చెప్పనేలేదు. పోలవరానికి నిధులు విడుదలలో జరుగుతున్న జాప్యం గురించి అన్యాయం గురించి మాటమాత్రంగానైనా ప్రధాని ఎదుట ప్రస్తావించనేలేదు. విభజన సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడరు. అలాంటి నేపథ్యంలో ఆయన చిత్తశుద్ధిని ఎలా నమ్మడం? ప్రధాని ఢిల్లీలో విడిగా కలిసినప్పుడు మాత్రమే ఇవి మాట్లాడతారా? బహిరంగ సభలో ప్రజల ఎదుట మాట్లాడడానికి చిన్నతనంగా ఫీల్ అవుతున్నారా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
నిజానికి ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి పుష్కలంగా వ్యక్తిగత కారణాలు ఉన్నాయనేది అందరి అనుమానం. ‘తన మీద ఉన్న అవినీతి సిబిఐ కేసుల విషయంలో ఊరట కోసం జగన్ మోడీ ఎదుట అతి విధేయత ప్రదర్శిస్తుంటారు’ అని అందరి భావన. దానికి తోడు ఇటీవలి కాలంలో ఆయన ఎజెండాలో మరో కీలకమైన అంశం చేరింది. అది వివేకానంద రెడ్డి హత్యోదంతం. వై.ఎస్ కుటుంబానికే ప్రమేయం ఉందని అందరి అనుమానాలు సాగుతున్న వేళ ఆ కేసులోంచి ఎంపీ అవినాష్ రెడ్డిని తప్పించడానికి కూడా జగన్ మోడీ ఎదుట మోకరిల్లుతున్నట్టుగా ఒక ప్రచారం ఉంది. తాజాగా ఆయన ఎజెండాలో మరో అంశం కూడా జత చేరుతున్నట్లే అనుకోవాలి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి అరెస్టు తరువాత వైసిపి ఇరకాటంలో పడింది. ఏపీ మద్యం కుంభకోణం లావాదేవీలతో కూడా దీనికి సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీలోని అనేకమంది పెద్ద తలకాయలు ఈ కుంభకోణంలో సూత్రధారులుగా పాత్రధారులుగా నిగ్గుతెలబోతున్నారు. అందులోంచి కూడా బయట పడేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి మోడీని ఆశ్రయిస్తారని ఇప్పుడు ఒక ప్రచారం మొదలవుతోంది. ఇలా నానాటికీ పెరుగుతున్న కేసులు, పెంచుకుంటూ పోతున్న ఎజెండా అంశాలతో మోడీని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ అత్యంత భారీగా జన సమీకరణ రూపంలో నానా పాట్లు పడుతున్నారు!