వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు మధ్య ఇజ్జత్ కా సవాల్ అనదగిన, ప్రతిష్ఠకు సంబంధించిన సమరం ఇది. రాష్ట్రంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ఏపీలో జగన్ మళ్లీ గెలవడం సాధ్యం కాదని చెబుతున్నారు. దారుణంగా ఓడిపోబోతున్నారని కూడా చెప్పారు. అయితే అప్పట్లోనే జగన్ దగ్గరినుంచి ఆయన పార్టీకి చెందిన అనేకమంది నాయకులు విడతలు విడతలుగా ప్రశాంత్ కిశోర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ప్రశాంత్ కిశోర్ కు మైండ్ చెడిపోయిందని కూడా అన్నారు.
ఆయన అవేమీ పట్టించుకోలేదు. కానీ ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఐప్యాక్ బృందమే ఏపీలో జగన్ కోసం పనిచేస్తూ వచ్చింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. వారి ఆఫీసుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ఈసారి తమ పార్టీ 151 కంటె ఎక్కువ సీట్లు సాధించబోతున్నట్టుగా చెప్పుకున్నారు. ఆయన అక్కడితో ఊరుకున్నా సరిపోయేది. ప్రశాంత్ కిశోర్ కు ఏమీ తెలియదని.. నిజానికి ఆయన క్షేత్రస్థాయిలో చేసేదేమీ ఉండదని, అక్కడ పనిచేసేవాళ్లు వేరే ఉంటారని కూడా జగన్ సెలవిచ్చారు. ప్రశాంత్ కిశోర్ తెలివితేటలను హేళన చేశారు.
నిజానికి 2019 ఎన్నికలకు పూర్వం ప్రశాంత్ కిశోర్ మీదనే ఆధారపడి జగన్ రాజకీయం చేశారనే వాదన ఉంది. పీకే ఏం చెబితే అది చేస్తూ ఎలాగోలా మొత్తానికి అధికారంలోకి వచ్చారు. అయితే.. ఈసారి జగన్ ఓడిపోతాడని చెప్పేసరికి.. పీకేను హేళన చేయడం ప్రారంభంచారు.
కానీ పీకే ఆ కామెంట్స్ ను పట్టించుకోలేదు. తాజాగా ఆయనను పలు చానెళ్లు ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో దేశంలోని ఫలితాల గురించి వాకబు చేసినప్పుడు.. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని అంటూనే.. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం.. జగన్ ఓడిపోతున్నారని పునరుద్ఘాటించారు.
జగన్మోహన్ రెడ్డి తనను తాను ప్రజాస్వామ్యంలో ఎన్నికైన పాలకుడిలాగా కాకుండా, రాజులాగా దేవుడిలాగా భావించుకుంటున్నారని, ప్రజలకు ప్రొవైడర్ గా భావించుకుంటున్నారని అదే ఆయనకు చేటుచేబోతున్నదని చెప్పారు.
ఇప్పుడు ఏపీలో ఫలితాలు అనేవి- జగన్- పీకే అనే ఇద్దరు వ్యక్తుల తెలివితేగలకు, ప్రతిష్ఠకు సవాలుగా మారిపోయాయి. ఏం జరుగుతుందో వేచిచూడాలి.
పీకేకి జగన్ కు మధ్య ఇజ్జత్ కా సవాల్!
Wednesday, January 22, 2025