వైఎస్ జగన్మోహన్ రెడ్డిమీద ఒక రాయివిసరడం అనే ఆకతాయి చర్య చోటుచేసుకున్నదో లేదో.. దానిని చిలవలు పలవలుగా పెంచి.. చంద్రబాబునాయుడు స్వయంగా చేయించిన హత్యాప్రయత్నంగా రంగు పులమడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. జగన్ నుదుటి మీద చిన్న గాయం అయిన పది నిమిషాలకెల్లా.. అది హత్యాప్రయత్నం అంటూ సాక్షిటీవీ ప్రచారం ప్రారంభించింది. మరునాడు ఉదయాన్నే సాక్షి విలేకరులతో సంఘటనస్థలానికి చేరుకుని అది ఏరకంగా హత్యాప్రయత్నం అవుతుందో..
తమ తమ అభిప్రాయాలను వండడం ప్రారంభించారు. అదే విధంగా ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల రామక్రిష్ణారెడ్డి మరికొందరు వైసీపీ నాయకులు కూడా హత్యాప్రయత్నంగా చెప్పసాగారు. అందరూ చేసిన వాదన ఒక్కటే. అది మామూలు రాయి విసరడం కానే కాదు.. ఎయిర్ గన్ లాంటి దానితో పేల్చారు.. అని చెప్పుకొచ్చారు. సాక్షి టీవీ పాపం.. వారికే అర్థంకాని అయోమయ వాదనలు వినిపించింది. ఎయిర్ గన్ తో కాల్చారని అంటూనే.. ఎయిర్ గన్ లో గుండ్రటి రాయి అయితేనే వేయగలరని, జగన్ కు వై ఆకారంలో గాయమైంది గనుక.. అది గులకరాయి అయి ఉంటుందని దానిని ఎయిర్ గన్ తో పేల్చలేరని చెప్పుకొచ్చింది. క్యాట్ బాల్ ద్వారా రాయి వేసి ఉంటారని తేల్చేశారు. చాలా శిక్షణ పొందిన క్యాట్ బాల్ వాడేవారికి సుపారీ ఇచ్చి మరీ వారితో రాయి విసిరేలా చేశారని, ఇది జగన్ ను చంపడానికి చేసిన ప్రయత్నం అని ఊదరగొట్టారు.
కానీ విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా మాటలతో ఈ రెండు రోజుల పాటు సాగించిన దుష్ప్రచారం మొత్తం అబద్ధం అని డొల్ల అని తేలిపోయింది. హత్యాయత్నం అంటూ ఊదరగొట్టిన తీరు అరాచకం అని కూడా ప్రజలకు అర్థం అవుతోంది.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా, విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటాను పిలిపించి మాట్లాడారు. సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు చెప్పిన వివరణలో విద్యుత్తు తామే తొలగించినట్టు చెప్పిన కమిషనర్, అది ప్రోటోకాల్ భాగమే అన్నారు. అలాగే.. గంగానమ్మ గుడి దగ్గరి నుంచి దాడి జరిగిందని చెబుతూ ఒక వ్యక్తి రాయి విసిరినట్టుగా గుర్తించాం అని.. త్వరలోనే అతడిని పట్టుకుంటాం అని చెప్పారు. ఇంకా దర్యాప్తు ఎన్నిరకాలుగా సాగుతోందో వివరించారు. మొత్తానికి ఎయిర్ గన్ వాడడం గానీ, కాట్ బాల్ తో విసరడం గానీ జరగలేదని తేలిపోయినట్టే. ఎందుకంటే.. ఒక వ్యక్తి రాయి విసిరినట్టుగా వీడియోలో గుర్తించాం అని సాక్షాత్తూ కమిషనర్ చెబుతున్నారు. ఏతావతా.. అబద్ధపుప్రచారాలతో చంద్రబాబు మీద బురదచల్లి, హత్యాయత్నం అంటూ అరచి గోలచేసి సానుభూతి పొందడానికి జగన్ దళం ప్రయత్నించినట్టుగా అర్థమవుతోంది.
సజ్జల, సాక్షి ప్రచారం అబద్ధం అని తేలినట్టే!
Sunday, December 22, 2024