రాజధాని రైతులకు కావాల్సింది ఇదే కదా!

Monday, December 8, 2025

ఒకవైపు అమరావతి రాజధానిలో దాదాపు ఇరవైవేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పనులు సాగిస్తుండగా.. కీలక నిర్మాణాలు జోరుగా నడుస్తున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణం మహా జోరుగా జరుగుతోంది. ఐకానిక్ భవనాలనిర్మాణాలు కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం కూడా.. నిర్మాణపనులతో సందడిగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. రాజధానికోసం భూములు ఇచ్చిన తమకు ప్రభుత్వం కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను కూడా అభివృద్ధి చేసి ఇస్తే.. తమ వంతు నిర్మాణాలు చేసుకుంటాం కదా.. అనేది రైతుల కోరిక. అమరావతి కీలక భవనాల నిర్మణాలతో సమాంతరంగా.. రైతులకు దక్కే రిటర్నబుల్ ప్లాట్లలో కూడా పనులు జరిగే బాగుంటుంది కదా.. అని వారు ఆలోచిస్తున్నారు. అయితే.. వారి కోరిక త్వరలోనే తీరనుంది. రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ తాజాగా ప్రకటించారు.

నిజానికి రిటర్నబుల్ ప్లాట్లను త్వరితగతిన అభివృద్ధి చేయడం అనేది రాజధానికి కూడా గొప్ప ఎడ్వాంటేజీ అవుతుంది. ఒకవైపు ప్రధాన భవనాల నిర్మాణాలు అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ వచ్చి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వెళ్లిన తర్వాత.. రాత్రీ పగలూ తేడాలేకుండా షిఫ్టుల విధానంలో అనేక నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. మూడేళ్లలోగా రాజధాని పనుల నిర్మాణం పూర్తి కావాలనే ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. కాగా రైతులకు దక్కే రిటర్నబుల్ ప్లాట్లలో మాత్రం ఇంకాస్తబ్దత ఉంది. ఆ ప్రాంతాల్లో చేపట్టవలసిన మౌలిక వసతుల విషయంలో ఇంకా పనులు మొదలు కాలేదు. అవికాస్తా పూర్తయితే.. తమ స్థలాల్లో   కూడా నిర్మాణాలు చేసుకుంటాం కదా.. అనేది రైతుల వాదన. అలా జరిగితే గనుక.. మూడునాలుగేళ్లలో కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కాకుండా.. ప్రెవేటు  రైతులకు దక్కే భవనాలతో పాటు.. మొత్తం అమరావతి రాజధానికి ఒక నిర్దిష్టమైన రూపురేఖలు వచ్చే అవకాశం ఉంది. అయిదే మంత్రి నారాయణ ఈ దిశగా రైతులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే ఈ పనులు మొదలు అవుతాయని అంటున్నారు.

ఇందుకోసం 300 కిమీల పొడవున ట్రంకురోడ్లు, 1500 కిమీల పొడవున లేఅవుట్ రోడ్లను నిర్మించడం జరుగుతుందని నారాయణ వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని పనులను కూడా చేపట్టబోతున్నట్టు ఆయన అంటున్నారు. ఇది భూములిచ్చిన రైతులకు పండగలాంటి వార్తే.

అలాగే.. రాజధానిలో వీఐటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు వచ్చే మార్చినాటికి రెండు మెడికల్ కాలేజీలను, సీబీఎస్ఈ పాఠశాలలను కూడా ప్రారంభించబోతున్నట్టు మంత్రి చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలో హేపీనెస్ట్, ఐకానిక్ టవర్ల సహా.. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ పనులు అనుకున్న గడువులోగా పూర్తిచేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మొత్తానికి రాజధాని అమరావతి ఈ ప్రభుత్వ కాలంలోనే సంపూర్ణంగా సాక్షాత్కరిస్తుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles