తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. నిరుపేదలు ఎన్ని ఇక్కట్లకు గురవుతూ ఉంటారో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది.. కానీ సరైన వైద్యం అందించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులో ఉంటాయనే గ్యారంటీ లేదు. పెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రమే అలాంటి ఆస్పత్రులు ఉంటాయి. అక్కడ వైద్యం ఉచితంగానే అందినా.. కుటుంబసభ్యులు తమ పల్లెలల నుంచి ఆ నగరాలకు వెళ్లడం, కష్టనష్టాలకోర్చి అక్కడ చికిత్స జరిగినంత కాలం ఉండడం అన్నీ వారికి పెద్ద యాతనే. గ్రామీణ ప్రాంతాల నిరుపేదలు అనుభవించే ఇలాంటి కష్టాలకు చంద్రబాబునాయుడు సంకల్పం చరమగీతం పాడనుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తే గొప్ప ఆలోచనతో ప్రజారోగ్య రంగాన్ని పరిపుష్టం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలోనూ ప్రభుత్వ – ప్రెవేటు భాగస్వామ్య విధానం పీపీపీ లో కనీసం వంద నుంచి మూడువందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయబోతున్నట్టు చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్తను అందించారు. ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో ఇలాంటివి ఉన్నాయని.. మిగిలిన 105 చోట్ల ప్రాధాన్య క్రమంలో ఏర్పాటుచేస్తామని అంటున్నారు.
ఈ విధానం కింద… వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో ఆయా ప్రెవేటు ఆస్పత్రులకు అవసరమైన రాయితీలను ప్రభుత్వం అందజేస్తుంది. ‘స్థలం రాయితీపై ఇస్తాం.. మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఆస్పత్రులకు ఎక్కువ రాయితీలు అందజేస్తాం.. ఎన్టీఆర్ వైద్యసేవ కింద 50 శాతం రోగుల్ని ఆయా ఆస్పత్రులకు పంపుతాం.. అవుట్ పేషెంట్లకు కూడా ఈ పథకం వర్తింపజేస్తాం’ అని చంద్రబాబు ఆసుపత్రుల స్థాపనకు ముందుకు వచ్చే వారికి భరోసా కల్పిస్తున్నారు.
నిజంగానే మారుమూల ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఉండేవారికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వెళ్లడం అనేది శ్రమతో కూడుకున్న పని. అవన్నీ ఎక్కడో నగరాల్లో ఉంటాయి. ఎన్టీఆర్ వైద్యసేవ వర్తించేవారి కష్టాలు ఒక రకం అయితే.. సొంతంగా డబ్బు పెట్టుకోగల సంపన్నులకు మరో రకం కష్టాలు ఉంటాయి. మంచి ఆస్పత్రులు వీలైనంత దగ్గర్లోనే ఉండడం అనేది చాలా ముఖ్యం.
ఆ సంకల్పంతోనే చంద్రబాబునాయుడు ఈ విధానం తీసుకువస్తున్నారు. అలాగే.. ఆస్పత్రుల్లో రోగులు రోజులతరబడి గడపాల్సిన అవసరం లేకుండా.. ఆన్ లైన్ లో వైద్య సలహాలు అందజేసే విధానాలకు కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు. వీటితో పాటు పాఠశాల స్థాయి నుంచి మెరుగైన ఆహారపు అలవాట్లు, మంచి జీవన విధానం అనేవి సిలబస్ లో భాగంగా మారుస్తామని కూడా చంద్రబాబునాయుడు ప్రకటించడం గొప్ప ఆలోచనే అని అభినందనలు వస్తున్నాయి.
ఆరోగ్యభరోసా పరంగా ఇది అతిగొప్ప వరమే కదా!
Sunday, April 27, 2025
