బీసీ కార్డు ప్రయోగం చవకబారుతనం కాదా?

Wednesday, March 26, 2025

రాజకీయాలు చేసినంత కాలం.. గడుసుగానే చేస్తూ వస్తారు. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయంటే మాత్రం.. తమకు అన్యాయం జరుగుతున్నదని.. సానుభూతి పొందడానికి ఎలాంటి కార్డు ప్రయోగించాలా.. అని అన్వేషిస్తుంటారు. అనుచితమైన పరిస్థితుల్లో కూడా బీసీ కార్డు ప్రయోగించి లబ్ధి పొదాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి కుటిల రాజకీయ ప్రయోగాలు అలాగే కనిపిస్తున్నాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేని వేర్వేరు వ్యవహారాల్లో.. ఆయా వ్యవహారాలకు సంబంధించి కులం ప్రస్తావనకు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ.. తమకు క్లిష్ట పరిస్థితులు రాగానే.. ‘బీసీ కార్డు’ను బయటకు తీస్తున్నారు. కాగా, ఇదొక చవకబారు రాజకీయ టెక్నిక్ అని ప్రజలు విమర్శిస్తూ ఉండడం గమనార్హం.

విశాఖపట్నం నగర కార్పొరేషన్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. ఇటీవల కూడా ఆరుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరడం జరిగింది. కూటమికి కార్పొరేషన్ లో స్పష్టమైన ఆధిక్యం ఏర్పడింది. ఇంకా కొందరు టీడీపీ, జనసేనల్లో చేరే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. నాలుగేళ్ల గడువు ఈ నెల 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో.. తెలుగుదేశం నాయకుడు పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మేయరుపై అవిశ్వాసానికి నోటీసు కూడా ఇచ్చారు. ఆ పర్వం కాస్తాపూర్తయితే.. విశాఖ కార్పొరేషన్ కూటమి పరం అవుతుందని అంతా అనుకుంటున్నారు.

తమ కార్పొరేటర్లు గుడ్ బై చెప్పకుండా ఉండడానికి వైసీపీ ముగ్గురు కీలక నేతల్ని రంగంలోకి దించింది. గుడివాడ అమర్నాధ్, కురసాల కన్నాబాబు, బొత్స సత్యనారాయణ తమ వంతు ఎంత ప్రయత్నాలు చేసినా.. కార్పొరేటర్లను బుజ్జగించలేకపోయారు. తీరా ఇప్పుడు బొత్స సత్యనారాయణ కొత్త పాట ఎత్తుకున్నారు. బీసీ మహిళ మేయరుగా ఉండడం చూసి ఓర్వలేక టీడీపీ అవిశ్వాసం పెట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు కార్పొరేషన్ చేతులు మారడంలో జరుగుతున్న రాజకీయానికి.. మేయర్ బీసీనా? కాదా? అనే అంశానికి సంబంధమే లేదు. కానీ.. బీసీ కార్డును ప్రయోగించి.. టీడీపీని విలన్ గా ప్రొజెక్టు చేయడానికి చవకబారు ఎత్తుగడ అనుసరిస్తున్నారు.

ఆ ఒక్క విషయంలోనే కాదు.. ఇటు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజని.. స్టోన్ క్రషర్ యజమానుల్ని బెదిరించి రెండు కోట్ల రూపాయలు ముడుపులు బలవంతంగా తీసుకున్న కేసులో కూడా.. చాలా లేకిగా.. కులంకార్డును పైకి తీసుకువస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేపై కక్ష కట్టినట్టుగా కేసులు పెడుతున్నారని అంటున్నారు. అధికారంతో కళ్లుమూసుకుపోయి.. బెదిరించి కేసులు పెట్టించి వేధించి, అధికారుల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి నానా అడ్డదారులు తొక్కి మరీ విడదల రజని రెండుకోట్లు ముడుపులు పుచ్చుకున్నారు. తీరా బాగోతం బయటపడిన తర్వాత.. ఆమె బీసీ మహిళ అనేది వైసీపీ పెద్దలకు గుర్తుకొచ్చినట్టుంది. ఇలాంటి చవకబారు కులరాజకీయ ఎత్తుగడలను ప్రజలు ఎప్పటికీ అసహ్యించుకుంటారని, వీటివల్ల సానుభూతి పుట్టదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles