ఇలాంటి అతిచేష్టలు అధినేతకు తలనొప్పి కదా!?

Thursday, December 26, 2024

చంద్రబాబు నాయుడు అపూర్వమైన విజయాన్ని సాధించి నెల రోజులు అవుతోంది. ఈ వ్యవధిలో ప్రజల పట్ల, రాష్ట్ర పురోగతి పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆయన తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో మాట తప్పేది లేదని నిరూపించుకుంటున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం అయినా.. పెన్షనర్లకు పెంచిన పెన్షన్లను అరియర్స్ తో సహా ఒకటో తేదీ చెల్లించడం అయినా.. చంద్రబాబు ప్రభుత్వ విజయాలలో కీలకమైనవి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న ఓవరాక్షన్ ప్రభుత్వ అధినేతకు తలనొప్పి కలిగించే లా తయారవుతున్నాయి.

మంత్రి భార్యను అయినందుకు తనకు కూడా పోలీస్ ఎస్కార్ట్ సహా  ప్రోటోకాల్ మర్యాదలు ఉండాలని అధికారుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన హరిత రెడ్డి వైనం ప్రభుత్వానికి ఎదురైన మొదటి తలనొప్పి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత.. ‘‘మీకు జీతాలు ప్రభుత్వం ఇస్తోందా వైసిపి వాళ్ళు ఇస్తున్నారా.. మీకోసం నేను వెయిట్ చేయాలా.. ముందుగా రావాలని తెలియదా’’ అంటూ పోలీసులు మీద ఎగిరి పడిన తీరుపై చంద్రబాబు నాయుడు గుస్సా అయ్యారు. ఆమెకు రాంప్రసాద్ రెడ్డి కి కూడా క్లాస్ తీసుకున్నారు.

తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో మరో తల నొప్పి ఎదురైంది. తిరువూరు ఎమ్మెల్యే తొలగిపూడి శ్రీనివాసరావు తన నియోజకవర్గ పరిధిలో వైసీపీకి చెందిన మండల అధ్యక్షురాలు నిర్మిస్తున్న భవనానికి అనుమతులు లేవంటూ కూల్చివేయడానికి తాను స్వయంగా రంగంలోకి దిగడం సరికొత్త వివాదం. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తమకు కొమ్ములు మొలిచాయని అనుకునే  నాయకుల వైఖరి వలన పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలనొప్పి తప్పడం లేదు. అనుమతులు లేకుండా వైసిపి నాయకులు భవనం నిర్మిస్తున్నారంటూ దానిని కూల్చివేయాలని అధికారులకు పురమాయించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వారు నోటీసులు సర్వ్ చేసే లోగానే తానే పూనుకుని జెసిబిలను వెంట తీసుకువచ్చి కూల్చివేతను ప్రారంభించడం కచ్చితంగా దుందుడుకు చర్య. ఇలాంటి వారి వైఖరితో చంద్రబాబుకు తలనొప్పులు తప్పేలా లేవు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి దురహంకారంతో చెలరేగిపోయిందో, అదే తీరు ఫాలో కావడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు తమ పార్టీ ప్రజా ప్రతినిధులను నాయకులను అందరినీ అప్రమత్తపరిచి కాస్త అదుపులో ఉండేలా చూసుకోవాలని పార్టీ సీనియర్లే అభిప్రాయపడుతున్నారు. తప్పు జరుగుతూ ఉంటే ఉపేక్షించాలని కాదు గాని.. కూల్చివేత లాంటివి నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి అధికారులు చేస్తే పద్ధతిగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు తమ చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని  సూచిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles