ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు తెలుగుదేశం నుంచి చంద్రబాబునాయుడు నుంచి ప్రాణహాని ఉన్నదని, ఆయన తన మీద గులకరాయితో హత్యాయత్నం చేయించారని గోల చేస్తున్నారు. నన్ను ఏం చేసినా సరే.. నేను ప్రజలకోసం పనిచేస్తా అంటూ మరింత ఘాటుగా ప్రసంగాలు సాగిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ముఠా రాజకీయాలు ఎంతగా పెచ్చరిల్లుతున్నాయంటే.. ఆ పార్టీలోనే ఒక ముఠా వలన, మరొక ముఠాకు ప్రాణాపాయం ఉన్నదని భయపడేంతగా తయారవుతోంది. ఈ మేరకు వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తుండడం అనేది చిత్రమైన పరిణామం.
తిరుపతి జిల్లా సూళ్లూరు పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు స్థానికంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయనంటేనే మండిపడే వైసీపీ నాయకులు బోలెడు మంది ఉన్నారు. రెడ్డి వర్గానికి చెందిన వ్యతిరేక ముఠాలతో ఎస్సీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అతికష్టమ్మీద నెట్టుకొస్తున్నారు. ఒకదశలో ఆయనకు టికెట్ దక్కదని ప్రచారం కూడా జరిగింది గానీ.. చివరికి జగన్ టికెట్ ప్రకటించారు.
నియోజకవర్గంలో ప్రధానంగా.. డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేకు అనుకూల వర్గంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీ టౌన్ అధ్యక్షుడిగా ఉన్న కళత్తూరు శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ఉన్నారు.
ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సంజీవయ్య ఎన్నికల ప్రచార సమయంలో సత్యనారాయణ రెడ్డి వర్గీయులు, శేఖర్ రెడ్డి మీద దాడికి ప్రయత్నించారు. పరస్పర దాడులు శృతిమించాయి. అంతా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. దరిమిలా.. సత్యనారాయణ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదంటూ శేఖర్ రెడ్డి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
ఇద్దరూ ఒక్క పార్టీ వారే. మామూలు పరిస్థితుల్లో ఎలా ఉన్నా.. ఎన్నికల సమయంలో కలసి మెలసి పనిచేయాలి. అలాంటిది వర్గాలను సద్దుమణిగేలా చేయడంలో పార్టీ అధిష్ఠానం విఫలం అయింది. గన్ మ్యాన్ తో కాల్చి చంపిస్తానంటూ పదేపదే బెదిరిస్తున్నారని శేఖర్ రెడ్డి మీడియాతో చెప్పుకున్నారు. రెండు వర్గాల మధ్య ఇంతగా తగాదాలు ముదిరిన తర్వాత.. వారు సమన్వయంతో పనిచేయడం సాధ్యమేనా? పార్టీ నేతల మద్య సమన్వయం లేకుండా సంజీవయ్య మళ్లీ నెగ్గడం జరిగే పనేనా? అనిపలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీవాళ్లు వైసీపీ వాళ్లనే చంపుకునే ప్లాన్లా?
Thursday, December 26, 2024