తిరుమలేశుని లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బాధ్యత చూసిన ధర్మకర్తల మండలి గానీ, అధికారులు గానీ ఏ స్థాయిలో అవినీతికి, దందాలకు అలవాటు పడి.. చివరికి స్వామివారి ప్రసాదాన్ని కూడా భ్రష్టుపట్టించారో ఇప్పుడు తెలుగుదేశం బయటపెట్టింది. లడ్డూ తయారీకి కీలకంగా ఉపయోగించే నెయ్యి కొనుగోలులో వారు వ్యవహరించిన తీరు. కల్తీ నెయ్యి వస్తున్నా పట్టించుకోకుండా పనిచేసిన తీరు ఇప్పుడు పార్టీనే భ్రష్టు పట్టిస్తున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ బాగోతం బయటపడిన తర్వాత.. హైకోర్టులో పిటిషన్ వేసి.. ప్రత్యేకంగా ఈ అంశంపై విచారణ జరపాలని వైసీపీ కోరుతోంది. అయితే.. హైకోర్టు ద్వారా కమిటీ విచారణ జరిగితే.. నెయ్యి బాగోతంలో అసహ్యకరమైన వాస్తవాలు మరింతగా నిగ్గుతేలి.. వారి పార్టీ పరువే మరింతగా పోతుందని ప్రజలు భావిస్తున్నారు.
తిరుమల ప్రసాదాలకు వాడిన నెయ్యిలో బీభత్సంగా కల్తీ ఉన్నదని నిగ్గుతేలింది. ఈ విషయాన్ని తెలుగుదేశం బయటపెట్టింది. గుజరాత్ లోని ల్యాబ్ లో ప్రత్యేకంగా అప్పటి నెయ్యిని పరీక్షలకు పంపారు. అందులో కల్తీ ఉన్నదని, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి అందులో కలిసినట్టుగా ఉన్నదని పరీక్షల్లో తేల్చారు. దాని మీద ఇప్పుడు సర్వత్రా రాద్ధాంతం అవుతోంది. ల్యాబ్ రిపోర్టుల సహా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి వివరాలు బయటపెట్టారు. వైవీసుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకరరెడ్డి తదితరులను అరెస్టుచేసి ప్రాసిక్యూట్ చేయాలని కూడా డిమాండ్ చేశఆరు.
సాధారణంగా ఇంత పెద్ద ఘోరం బయటకు వచ్చిన తర్వాత.. వైసీపీ నాయకులు సిగ్గుతో మొహం చాటేసుకుని తిరగాలి. ఆ పనిచేయకపోగా, వాళ్లే హైకోర్టులో కేసు వేశారు. తొలుత ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంలో పరువునష్టం దావా వేయబోతున్నట్టుగా వైసీపీ నాయకులు ప్రకటించారు. తీరా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో మరో దావా వేశారు. లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యత గురించి వచ్చిన ఆరోపణలపై ప్రత్యేకంగా కమిటీ వేసి వాస్తవాలు తేల్చాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్ వల్ల వైసీపీ వారి బాగోతమే బయటకు వస్తుందని, తమ గొయ్యి తామే తవ్వుకున్నట్టు అవుతుందని ఆ పార్టీ వారే భయపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.