ఒక జిల్లాతో రివ్యూ నిర్వహించే పద్ధతి ఇదేనా జగన్!

Wednesday, January 22, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రం పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. ఏ నాయకుడు అయినా సరే.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి తిరిగి దారిలో పెట్టుకోవడానికి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి వీకెండ్ బెంగుళూరు ప్యాలెస్ కు విహారయాత్రలు వెళుతూ.. ఏదో టైంపాస్ రాజకీయం అన్నట్టుగా, మొక్కుబడి ఉద్యోగం చేసినట్టుగా.. వీక్ డేస్ లో పార్టీ నాయకుల సమావేశాలు నిర్వహిస్తుంటారు.

తాజాగా ఆయన కృష్ణా జిల్లా పార్టీ స్ఖథానిక సంస్థల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఓ రివ్యూ మీటింగ్  నిర్వహించారు. పార్టీని ఉద్ధరించాలని, తిరిగి గాడిలో పెట్టాలని అనుకుంటున్న వ్యక్తి రివ్యూ మీటింగులు నిర్వహించాల్సిన తీరు ఇదేనా? అని పలువురు విస్తుపోతున్నారు.
కృష్ణాజిల్లా నాయకులతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి సుమారుగా పదిహేను నిమిషాలకు పైగా తన ప్రభుత్వ హయాంలో ఎలాంటి గొప్ప పనులు చేశారో ఏకరవు పెట్టుకున్నారు.

తన ప్రభుత్వ కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ ఎలా ఘన విజయం సాధించిందో.. అందరికీ పూస గుచ్చినట్టుగా వివరించి చెప్పుకున్నారు. తన పార్టీ మీద ప్రజలు ఎంత గొప్పగా నమ్మకం పెట్టుకున్నారో కూడా వారికి వివరించారు. ఆ తర్వాత.. తెలుగుదేశం పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో.. ఎలాంటి హామీలను ప్రజలకు అందించిందో చెప్పడానికి.. మరో పదిహేను నిమిషాలకు పైగా కేటాయించారు.

అసలు.. అదే కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా అత్యంత నీచంగా ఓడిపోయిన పార్టీ ని ఉద్ధరించడానికి నేతలతో సమావేశం పెట్టి.. వారికి మార్గ నిర్దేశం చేయాల్సిన పద్ధతి ఇదేనా? అని వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోతుండడం విశేషం. జగన్ ఏలుబడి ఎలా సాగిందో, చంద్రబాబు ఎలాంటి హామీలతో అధికారంలోకి వచ్చారో ఇప్పుడు ఒక జిల్లా నాయకులకు మళ్లీ విడమరచి చెప్పాల్సిన అవసరం లేదు కదా అని వారంటున్నారు. ఇవన్నీ తమకు తెలియని విషయాలు కాదు కదా అంటున్నారు. పైగా జగన్ చిన్నా పెద్దా తేడా లేకుండా మైకు దొరికితే చాలు ప్రతిచోటా ఇదే రికార్డు వేస్తుంటారు. ఇలాంటి టైం వేస్టు వ్యవహారాలు లేకుండా సూటిగా మాట్లాడుతూ.. కార్యచరణ ప్రణాళిక, పార్టీ ఉద్దరణ గురించి మాట్లాడడం జగన్ నేర్చుకోవాలని వారంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో జగన్ పార్టీ గతంలో ఎలా గెలిచిందో ప్రజలందరికీ తెలుసు. పోలీసులను అండగా వాడుకుంటూ.. ఇతర నామినేషన్లే పడకుండా అడ్డుకుంటూ కిడ్నాపులు చేస్తూ దాడులుచేస్తూ మెజారిటీ సీట్లను దక్కించుకున్నారు.  ఆ విజయాలను చూసుకుని ఇప్పుడు మురిసిపోవడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles