వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచర దళాలు అమరావతి రాజధాని విషయంలో ఏ స్థాయిలో విషం కక్కుతున్నాయో గమనించిన రాష్ట్రప్రజలు వారిని ఈసడించుకుంటున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఎక్కడికక్కడ జలప్రళయం సంభవించినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. రాష్ట్రం మొత్తం ఏదో ఒకస్థాయిలో వరద విపత్తును అనుభవిస్తోంది. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించినంత వరకు రాష్ట్రంమొత్తం ఎలా మునిగిపోయినా వారికి అక్కర్లేదు. అక్కడ తాము కొత్తగా విషం చిమ్మడానికి ఏమీ లేదు. కానీ అమరావతిలో మాత్రం కనీసం మడమలలోతు నీళ్లు నిలిచిఉన్నట్టుగా కనిపిస్తే చాలు.. రాజధాని మొత్తం మునిగిపోయినట్టు.. మునిగిపోయే ప్రదేశంలో చంద్రబాబునాయుడు రాజధాని కడుతున్నట్టుగా.. దుర్మార్గమైన విషప్రచారానికి వారు తెగిస్తున్నారు.
అమరావతి రాజధాని నగర ప్రాంతంలో చాలా ముమ్మరంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎక్కడి కక్కడ గోతులు తవ్వి ఆ తవ్విన మట్టిన ఇతర ప్రాంతాల్లో కుప్పలు పోసి రకరకాల స్థితుల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో వర్షం ఇంత భారీగా కాదు కదా.. చిన్నస్థాయిలో వచ్చినా కూడా చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచి కనిపించడం చాలా సహజం. ఇలాంటివి కనిపించగానే.. వాగు పొంగిన నీళ్లు అమరావతిని ముంచేశాయని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి వైసీపీ దళాలు.
సాధారణమైన వర్షానికి గ్రామసీమల్లో పొలాలు ఏవిధంగా జలమయం అవుతాయో.. అన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది. అయితే, పొన్నూరు ప్రాంతంలో పాలాల మధ్య గట్లు స్పష్ఠంగా కనిపించేలా కొంతలోతుతో పొలాలన్నీ మునిగి ఉండగా.. అమరావతిని కాపాడడం కోసం వరద నీటి పొంగును మళ్లించి పొన్నూరును ముంచేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు.
అమరావతి విషయానికి వస్తే.. అక్కడ ఇప్పుడే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా డ్రైనేజీ వ్యవస్థలు ఏమీ ఏర్పాటు కానేలేదు. సాధారణంగా నగరాలు ఎంత భారీ వర్షం వచ్చినా సరే.. ఆ అదనపు నీటిని వేగంగా మళ్లించేసే డ్రైనేజీ వ్యవస్థ ఉంటే చాలా సురక్షితంగా ఉంటాయి. అలాంటిది.. ఇప్పటిదాకా డ్రైనేజీ పరంగా ఏ పనులూ జరగని అమరావతిలో.. వర్షాలకు కొద్దిగా నీళ్లు నిలబడగానే.. తప్పుడు ప్రచారం చేయడం వైసీపీ వారికి మాత్రమేచెల్లింది.ఈ దుర్మార్గాన్ని మంత్రి నారాయణ తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఐకానిక్ టవర్స్ కోసం చుట్టూ తవ్విన గుంతల్లో కొంత మేర నీళ్లు నిలిచి ఉంటే ఆ విజువల్స్ చూపిస్తూ రాజధాని మొత్తం మునిగిపోయినట్టుగాసాగిస్తున్న ప్రచారాల్ని ఆయన ఖండిస్తున్నారు. అయినా.. ఈ వైసీపీ దళాలు ఎన్ని కుట్రలు చేసినా సరే.. అమరావతి రాజధానిగా రూపుదిద్దుకోవడం ఖాయం. మూడున్నరేళ్లు అని మంత్రి, ముఖ్యమంత్రి అంటున్నప్పటికీ.. ఈ అయిదేళ్ల పదవీకాలం ముగిసేలోగా నగరానికి ఒక స్పష్టమైన రూపురేఖలు వస్తాయని అనుకోవచ్చు. అలాంటిది.. ఇంకా ఈ నగరం మీద విషం చల్లడం ద్వారా.. వైసీపీ వారు తమ దుర్బుద్ధులను బయటపెట్టుకోవడం తప్ప.. సాధించేదేమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
