ఏపీలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించి ఓట్లు వేస్తున్న వ్యవహారం రెండురోజులుగా జరుగుతోంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అనేక రకాల వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది ఉద్యోగుల పేర్లు పోస్టల్ బ్యాలెట్ జాబితాలో కనిపించడం లేదు. మరికొందరికి ఓటు ఇవ్వడం లేదు. ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన చోటు సరైన వసతులు కల్పించడంలేదు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంపై ఉద్యోగులు చిరాకుతో వదిలేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు. అయితే ఇలాంటి వైఫల్యాల వెనుక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కుట్ర ఉన్నదా? ఉద్యోగులు వేసే పోస్టల్ బ్యాలెట్లు వీలైనంత తక్కువ పోల్ అయితే మాత్రమే తాము గెలుస్తామనే అనుమానంతో వారు ఇలా చేస్తున్నారా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఏపీలోని యావత్ రంగాలకు చెందిన ఉద్యోగులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ప్రత్యేకించి 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారిలో జగన్ పట్ల అపరిమితమైన కోపం ఉంది. సీపీఎస్ రద్దు చేస్తానని ఆయా ఉద్యోగవర్గాలను గత ఎన్నికల సమయంలో ఆశపెట్టి ఊరించి.. వారితో ఓట్లు వేయించుకున్న జగన్ గెలిచిన తర్వాత మొండిచెయ్యి చూపించారు. సీపీఎస్ రద్దవుతుందని, తమ జీవితాలు గాడిలో పడతాయని ఆశించిన వాళ్లంతా దారుణమైన వంచనకు గురయ్యారు. పైగా ఉద్యోగులకు పీఆర్సీ పేరుతో ఐఆర్ కంటె తక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర సృష్టించారు కూడా. అలాగే పోస్టల్ బ్యాలెట్లలో అధికంగా ఉండే.. టీచర్లలో కూడా జగన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు తక్కువగా పోల్ కావడం గురించి వైసీపీ తపన పడుతున్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు అదే వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రాల బయటేనిల్చుని.. పోస్టల్ బ్యాలెట్ లను కొనడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్క ఓటుకు మూడువేల రూపాయల వరకు ఇచ్చి కొంటున్నట్టు తెలుస్తోంది.
ఉద్యోగులు ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ వచ్చేలా చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు గానీ.. జగన్ తమను దారుణంగా మోసం చేశాడని బలంగా నమ్ముతున్న అంగన్ వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులకు పోస్టల్ ఓట్లు అందనేలేదు. చాలా చోట్ల అసలు పోస్టల్ ఓట్లు చెల్లకుండా చేసేలా తెరవెనుక కుట్రలు కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వీలైనంత వరకు పోస్టల్ ఓట్లను కొనేయాలని.. అవి ఎక్కువ పోలైతే ఓటమికి కారణమవుతాయని వైసీపీ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. మరోవైపు ఉద్యోగులు కూడా జగన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి పంపాలనే ఉద్దేశంతో పట్టుదలగా శ్రమకోర్చి ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు.
పోస్టల్ బ్యాలెట్ వైఫల్యాల్లో వైసీపీ కుట్రలున్నాయా?
Sunday, December 22, 2024