లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు బహుముఖంగా చాలా వేగంగా జరుగుతోంది. డిస్టిలరీలు మద్యం తయారీ కంపెనీల నుంచి వాటాలు రాబట్టడానికి వసూళ్ల నెట్ వర్క్ ను నడిపిన కీలక వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పరారీలోనే ఉండవచ్చు గాక. అంతమాత్రాన.. కేసు దర్యాప్తు పూర్తిగా పడకేస్తుందనుకుంటే పొరబాటే అన్నట్టుగా సిట్ విచారణల్లో వేగం పెంచింది. పరారీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిచి విచారించింది. సాక్షిగా విజయసాయిరెడ్డి కూడా హాజరవుతున్నారు. అలాగే.. అప్పట్లో ముడుపులు సమర్పించిన మద్యం తయారీ కంపెనీల యజమానులకు కూడా నోటీసులు ఇచ్చారు. వీరందరినీ విడతలుగా విచారణకు పిలుస్తున్నారు. అప్పట్లో ముడుపులు సమర్పించిన వారితోనే వైసీపీ పాపాల భైరవులకు అసలు ముప్పు పొంచి ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్ సర్కార్ లిక్కర్ పాలసీలో.. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించి.. మద్యం కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకునేది. భారీగా లిక్కరు ధరలు పెంచిన నేపథ్యంలో పెంచిన ధరల వ్యత్యాసం మొత్తం.. ఆయా కంపెనీల నుంచి తమ అవినీతి దందా వాటాగా వసూలు చేసుకున్నారు. అలా పెంచిన మొత్తాలన్నింటినీ వాటాలు ఇచ్చేసే కంపెనీలకు మాత్రమే కొనుగోలు ఆర్డర్లు పెట్టారు. డబ్బు చెల్లింపుల తర్వాత వాటాల వసూళ్లకు ప్రత్యేక నెట్ వర్క్ నిర్వహించారు. ఈ నెట్ వర్క్ కింగ్ పిన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కాగా, ఆయన నుంచి సొమ్ములు అందుకున్న కీలక వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గా ఇప్పటిదాకా వినిపిస్తోంది. మిథున్ రెడ్డి నుంచి ఆ మొత్తాలు అందుకున్న అంతిమ లబ్ధిదారు, ముఖ్యనేత ఎవరో వీరి విచారణల్లో తేలాలి.
రాజశేఖర రెడ్డి తనకు లిక్కర్ స్కాంతో సంబంధమే లేదని ఒక మాట మెయిల్ పెట్టేసి అంతర్ధానం అయిపోయారు. ఆయన లేకపోతే విచారణ ఆగదు కదా. విజయసాయి సాక్ష్యాలతో చాలా కీలక విషయాలు తెలుస్తాయని అంచనా వేస్తున్నారు.
దానిని మించి డిస్టిలరీల యజమానులు వెల్లడించే వాస్తవాలు కీలకం అవుతాయని నమ్ముతున్నారు. పెంచిన ధరలను ప్రభుత్వం నుంచి పుచ్చుకున్న కంపెనీలు.. వాటాలను వైసీపీ వారికి ఇచ్చేసినప్పటికీ.. తమ బ్యాలెన్స్ షీట్ రికార్డుల్లో ఏదో ఒక ఖర్చులు చూపించుకోవాల్సిందే. అవన్నీ తప్పుడు లెక్కలే అయిఉంటాయి. బ్యాలెన్స్ షీట్ లను జాగ్రత్తగా గమనిస్తే.. అవి తప్పుడు లెక్కలని అర్థమవుతుంది. ఆ కోణంలోంచి లోతుగా పరిశీలిస్తే.. వాటాలు సమర్పించిన సంగతి నిర్ధరణ అవుతుంది. అలాగే.. వసూళ్లు ఎలా పంపేవారో.. ఎవరు తమతో కాంటాక్ట్ లో ఉండేవారో.. ఎవరు ఆదేశించేవారో.. ఈ వివరాలన్నీ డిస్టిలరీల యజమానులు సూటిగా చెప్పగలరు. మొత్తానికి వారి సాక్ష్యాలు ఈ కేసు విషయంలో తెరవెనుక నిందితుల గురించి ఒక అంచనాకు రావడానికి ఎంతో కీలకం అవుతాయని పలువురు భావిస్తున్నారు.
ముడుపులిచ్చిన వారితోనే ముప్పు పొంచి ఉందా?
Friday, December 5, 2025
