ఉమా అరెస్టుకు రంగం సిద్ధం అవుతోందా?

Saturday, May 4, 2024

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన మీద రాయి విసిరిన కేసుకు సంబంధించి, తెలుగుదేశం నాయకుడు బోండా ఉమా అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారా? ఈ కేసులో ఆయన ప్రేరేపణతోనే సతీష్ రాయి విసరడం జరిగింది అని కోర్టు ఎదుట చెప్పబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే దుర్గారావు అనే తెలుగుదేశం నాయకుడిని నిర్బంధంలోకి తీసుకొని నాలుగు రోజులపాటు విచారించి తర్వాత పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ద్వారా బోండా ఉమా పేరు చెప్పించేందుకు ప్రయత్నించారని అయినా నేరంతోనే తనకు సంబంధం లేనప్పుడు తన వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నకు అర్థం లేదని పోలీసులతో గట్టిగా వాదించినట్లు సదరు దుర్గారావు చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మరికొన్ని అంశాలను గమనిస్తే బోండా ఉమా అరెస్ట్ తప్పకపోవచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది.

నాలుగు రోజులపాటు పోలీసులు తనను విచారించిన సమయంలో ‘నీ వెనుక ఎవరున్నారు?’ అంటూ పదేపదే ప్రశ్నించారని ‘తమ దగ్గర అన్ని సాక్షాలు ఉన్నాయి’ అంటూ బెదిరించారని దుర్గారావు మీడియాతో చెప్పారు. బోండా ఉమా పేరు ప్రస్తావించి ‘ఆయన చెబితే చేశారా’ అని కూడా అడిగినట్టు చెప్పుకొచ్చారు. తాను వారి కోరినట్లుగా జవాబు చెప్పకపోయేసరికి కొట్టారని కూడా దుర్గారావు చెబుతున్నారు.
వీటన్నింటినీ మించి అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యవహారం ఏంటంటే విడుదల చేసేందుకు ముందు తన నుంచి తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు దుర్గారావు చెబుతున్నాడు. ఎటూ విడుదల చేసేస్తున్నారు కదా అనే ఉద్దేశంతో సంతకాలు పెట్టినట్టుగా చెప్పారు. అయితే తాను చేసిన తర్వాత తెల్ల కాగితాల మీద ఏం రాసుకుంటారో తనను మళ్ళీ ఎలా ఇరికిస్తారో అనే భయం కలుగుతుంది అని దుర్గారావు చెబుతున్నారు.

తెల్ల కాగితాలపై సంతకాల వ్యవహారాన్ని పరిశీలించినప్పుడు బోండా ఉమాను ఇరికించడానికి పోలీసులు అలాంటి ప్రయత్నం చేశారనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. తొలినుంచి బోండా ఉమాను ఈ కేసులోకి తీసుకురావాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా వ్యవహారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వేముల దుర్గారావు దగ్గర సంతకాలు తీసుకున్నారు కనుక బోండా ఉమా ఇరికించేలా వాంగ్మూలం తయారు చేస్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి మరింత ఇబ్బందికరంగా పరిణమించేలాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా పూర్తయిన తర్వాత బోండా ఉమాను అరెస్టు చేసి జైల్లో పెడతారని దానివల్ల పార్టీకి రాజకీయంగా కూడా నష్టం ఉంటుందని ప్రజలు అంచనా వేస్తున్నారు. పోలీసులు ఈ కేసును ఇంకా ఎన్నెన్ని మలుపులు తిప్పుతారో వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles