పరిపాలనలో విచ్చలవిడితనానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుంగు సహచరుల మీద అనేక కేసులు ఎదురుచూస్తూ ఉన్నాయి. జగన్ తాను కలలు గన్న రాజధానిలో.. రుషికొండను విధ్వంసం చేసి మరీ, తన నివాసం కోసం నిర్మించకోదలచుకున్న ప్యాలెస్ విషయంలో వారందరి మీద తాజాగా మరో కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు కేసు నమోదు కావడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ.. వారికి కొమ్ముకాసినందుకు అప్పటిక చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద కూడా కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
విశాఖ జిల్లా రుషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించడం, 420 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి సంబంధించి వారి మీద కేసు నమోదు చేయాలంటూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి.గంగాధర్ ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
ప్రజలు తనకు ఒక్క చాన్స్ ఇచ్చారు గనుక.. మరో ముప్పయ్యేళ్ల పాటు తానే చిరస్థాయిగా అధికార సింహాసనం మీద కూర్చుని ఉంటానని జగన్మోహన్ రెడ్డి కలలు కన్నారు. విశాఖ బీచ్ అందాలకు తలమానికమైన రుషికొండను విధ్వంసం చేసి మరీ.. తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం మూడు కళ్లుచెదిరే ప్యాలెస్ లను నిర్మింపజేసుకున్నారు. సాధారణంగా ప్రతి నగరంలోనూ సొంత ప్యాలెస్ లు కట్టుకునే మోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఎటూ అధికారం రాబోయే మూడు దశాబ్దాలు తనదే గనుక.. ప్రభుత్వం సొమ్ము తోనే కట్టించుకోవాలని అనుకున్నారు. పర్యాటక శాఖకు చెందిన భవంతులు, అతిథి భవనాలు అనే ముసుగులో.. తన నివాస భవనాలను నిర్మించుకున్నారు. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదని కోర్టులో ఎన్ని పిటిషన్లు దాఖలైనా ఖాతరు చేయలేదు. నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ పాపం.. ఒక్కరోజు కూడా అందులో నివాసం ఉండలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చి పరాజయం చవిచూడాల్సి వచ్చింది.
బిడ్డచచ్చినా పురిటివాసన పోలేదన్న సామెత చందంగా.. అధికారం పోయింది గానీ.. రుషికొండను విధ్వంసం చేసిన పాపం ఇంకా వెన్నాడుతూనే ఉంది.
ప్రెవేటు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా జగన్ తో పాటు, అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి, అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబాబు, రోజా, జోగి రమేష్, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తదితరులపై కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ఎదుట వారు ఈ దురాగతాల్ని ఎలా సమర్థించుకుంటారో చూడాలి.
జగన్ అండ్ కో పై ఆ కేసు కూడా తప్పదా?
Wednesday, January 22, 2025