కడప పార్లమెంటు నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక వస్తుందా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి త్వరలో శిక్ష పడుతుందా? దాని పర్యవసానంగా ఆయన జైలు పాలు కావడంతో పాటు, మరో ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోబోతున్నారా? అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కటొక్కటిగా తాము చక్కబెట్టవలసిన కార్యాలను చూసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో వివేకానంద రెడ్డి హత్య కేసును సీరియస్ గా పరిగణించి త్వరలోనే ఒక కొలిక్కి తీసుకురావడానికి కూడా వారు చర్యలు తీసుకుంటారనే సమాచారం ఉంది.
ఆ ప్రయత్నంలో అవినాష్ రెడ్డి మెడకు ఈ కేసు ఇంకా గట్టిగా బిగుసుకుంటుందని ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ప్రదర్శించిన అలసత్వ ధోరణి ఈ విషయంలో ఇక ఉండదని, కేసు విచారణ కూడా త్వరలోనే కొలిక్కి వచ్చి శిక్షలు కూడా పడతాయని అందరూ అనుకుంటున్నారు. అదే జరిగితే అవినాష్ రెడ్డికి పడేశిక్ష ఖచ్చితంగా రెండేళ్లకు మించి ఉండే అవకాశం ఉంది.
నేరం రుజువై అలాంటి రెండేళ్లకు మించిన శిక్ష పడినప్పుడు ఆ వ్యక్తి ప్రజాప్రతినిధిగా అనర్హుడు కావడంతో పాటు, మరో ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హతను కూడా కోల్పోతారు. ఆ విధంగా కడప ఎంపీ స్థానానికి బహుశా ఒక ఏడాదిలోగా ఉప ఎన్నిక నివార్యంగా వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాటలు కూడా ఇలాంటి అనుమానాలకు వూతమిస్తున్నాయి.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి త్వరలోనే అరెస్టు అవుతారని, కడప ఎంపీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి భూపేశ్ రెడ్డి ఈ దఫా ఘన విజయం సాధిస్తారని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింతగా పతనం వైపు తీసుకువెళ్లే క్రమంలో కడప ఎంపీ స్థానం రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాయో వేచి చూడాలి!