అవసరం తీరేదాకా ఓడమల్లన్న.. తీరిన తర్వాత బోడిమల్లన్న అనే సామెతను రాజకీయ నాయకులు చాలా నిష్టగా అనుసరిస్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా సజ్జన్ జిందాల్ విషయంలో ఇలాంటి వైఖరినే అవలంబిస్తున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. బోడి మల్లన్న అనడం మాత్రమే కాదు.. సజ్జన్ జిందాల్ ను ఇరికించేసి తాను నిష్కళంకుడిగా ముద్ర వేయించుకోవడానికి ఉత్సాహపడుతున్నారా? అని కూడా అనిపిస్తోంది. ఆయన కరపత్రిక తన వార్తలలో సాగిస్తున్న ప్రచారాన్ని గమనిస్తే ఎవరికైనా సరే కలిగేది ఈ అభిప్రాయమే!
ఏపీ రాష్ట్ర రాజకీయాలను ముంబాయి హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం ఒక్క కుదుపు కుదుపుతున్న సంగతి అందరికీ తెలుసు. ఆమె హోం మంత్రి అనితను కలిశాక కాసేపు మీడియాతో మాట్లాడిన ముచ్చటను జగన్ కరపత్రిక చాలా బాగా కవర్ చేసింది. తన కేసు విషయంలో పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్టు తన వద్ద ఆధారాలు లేవని చెబితే.. జగన్ కరపత్రిక హేపీగా ప్రచురించింది. కానీ కాదంబరి జరిగింది ఫిర్యాదు చేసిందే తప్ప ఎవ్వరి పాత్రల గురించి నోరు విప్పలేదు.
జిందాల్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై జత్వానీ నోరు విప్పలేదని జగన్ కరపత్రిక ఆవేదన చెందుతోంది. వారి పాత్ర ఉందా అని అడగ్గానే కాదంబరి నో కామెంట్ అంటూ వెళ్లిపోయారని, ఆమె మాట్లాడదలచుకోలేదని జత్వానీ తరఫు న్యాయవాది చెప్పారు. కేసు వెనుక అసలైన వివాదం జిందాల్ దే కదా అంటూ ప్రశ్నించగా ఆమె జవాబివ్వలేదట. ఆ ప్రశ్న ఎవరు అడిగారో గానీ..ప్రముఖంగా ప్రచురించారు.
ఆ రకంగా జిందాల కుటుంబాన్ని ఈ కేసులో పూర్తిగా ఇరికించేసి అంతా వారే చేసినట్టు నమ్మించడం ద్వారా.. జగన్ మరియు ఆయన అనుంగు సహచరులు సేఫ్ జోన్ లోకి వెళ్లగలమని కలగంటున్నట్టుగా ఉంది. జిందాల్ ద్వారా భారీ మొత్తాలు లబ్ధిపొందినట్టుగా, వందల కోట్లు చేతులు మారినట్టుగా అనేక ఆరోపణలున్నాయి. చివరికి జగన్ చెల్లెలు షర్మిల కూడా జిందాల్ కోసం జగనే స్వయంగా కాదంబరి కేసును అలా డీల్ చేశారని ఆరోపించారు. అయితే ఇప్పుడు జగన్ మాత్రం జిందాల్ ను ఇరికించి తను బయటపడాలని ప్లాన్ చేస్తున్నట్టుగా, విచారణ ఎదుర్కోబోయే వారికి అలొంటి సమాధానాలు చెప్పాలని హింట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.