ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హత్యారాజకీయాలు మితిమీరుతున్నాయంటూ.. సాధారణ దొమ్మీ చావుల్ని, వ్యక్తిగత స్పర్ధల హత్యల్నీ కూడా భూతద్దంలో చూపించడానికి, రాజకీయ హత్యలుగా రంగుపులమడానికి తన శక్తివంచనలేకుండా కష్టపడుతుంటారు. పుంగనూరులో జరిగిన తాజా హత్యను గమనిస్తే మాత్రం.. హత్యారాజకీయాలు మితిమీరుతున్నాయనే ఆయన మాట నిజమే అనిపిస్తుంది. అదిమాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కూడా.. పుంగనూరులో మాత్రం వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యమే నడుస్తుంటుందని.. అక్కడి పోలీసు యంత్రాంగం కూడా ఆయన కనుసన్నల్లో మాత్రమే నడుస్తూ ఉండాలని కూడా అనుకోవాల్సి వస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన క్రియాశీల కార్యకర్త, కేవలం రాజకీయ కారణాలు మరియు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా హత్యకు గురికావడం ఇప్పుడు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
పుంగనూరు నియోజకవర్గంలోని ఒక కృష్ణాపురం గ్రామంలోని రామక్రిష్ణనాయుడు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త. ఆ గ్రామంలో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం తరఫున పోలింగ్ ఏజంటుగా కూడా కూర్చున్నారు. ఆ రకంగా వైసీపీ వారి దొంగఓట్ల కుట్రలను అడ్డుకున్నారు. నిజానికి ఆనాటినుంచే రామక్రిష్ణనాయుడు మీద వైసీపీ కార్యకర్తలు కక్ష కట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వెల్లువెత్తిన గత ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవడం వెనుక అసలు రహస్యం దొంగఓట్లే అన్నది జగమెరిగిన సత్యం. తమ దొంగఓట్ల దందాను అడ్డుకున్నందుకు రామక్రిష్ణ మీద కక్షకట్టిన వైసీపీ కార్యకర్తలు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే దాడిచేసి కొట్టారు. పుంగనూరులో పెద్దిరెడ్డి గెలిచినప్పటికీ.. రాష్ట్రంలో తెలుగుదేశం విజయాన్ని టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకుంటున్న రామక్రిష్ణతోపాటు, ఆయన భార్యమీద కూడా దాడిచేసి గాయపరిచారు. పరిస్థితి ఎంత ఘోరం అంటే.. వారు పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. ఇరువర్గాల మీద కేసులు నమోదు చేయడం జరిగింది.
అప్పటినుంచి రామక్రిష్ణను టార్గెట్ చేసిన వైసీపీ వారు 15 రోజుల కిందట రామక్రిష్ణ తన పొలంలో మట్టి తరలిస్తుండగా.. దాడిచేసి కొట్టారు. ఆయన కొడుకు సురేష్, కోడలిమీద కూడా దాడి జరిగింది. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. సీఐ పట్టించుకోలేదు. పెద్దిరెడ్డికి భయపడి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. చాలా ఒత్తిడిచేశాక.. దాడిచేసిన వారిని అయిదునిమిషాలు సెల్ లో ఉంచి తర్వాత వదిలేశారు.
శుక్రవారం రాత్రి గ్రామంలో దేవుడి రథం ఊరేగింపు సందర్భంగా వైసీపీ వారు దౌర్జన్యం చేయడంతో మళ్లీ ఘర్షణ జరిగింది. దాని ఫాలో అప్ గా శనివారం ఉదయం రామక్రిష్ణ కొడుకు సురేష్ ఒక దుకాణం వద్ద ఉంటే అతడిని కత్తులతో నరికే ప్రయత్నం చేశారు. అతడు గాయాలతో పారిపోగా, అదే సమయానికి ట్రాక్టరుపై వస్తున్న రామక్రిష్ణను నరికేశారు. తనకు వారినుంచి ప్రాణహాని ఉన్నట్టు రామక్రిష్ణ పోలీసులకు ఎంత మొరపెట్టుకున్నా వారు పట్టించుకోకపోవడం విశేషం.
చూడబోతే.. రాష్ట్రంలోర ఎన్డీయే కూటమి ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ.. పుంగనూరులో రాజ్యం చేసేది తానేనని, పోలీసులు తన చెప్పుచేతల్లో ఉండాల్సిందేనని, తెలుగుదేశం వారినైనా చిటికెలో హత్యలు చేయించగలనని పెద్దాయన నిరూపించదలచుకున్నట్టుగానే రామక్రిష్ణ హత్య, ఆయన కొడుకు సురేష్ మీద జరిగిన హత్యా ప్రయత్నం ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు.
ప్రభుత్వం ఎవరిదైనా అక్కడ పెద్దిరెడ్డిదే రాజ్యమా?
Thursday, December 11, 2025
