జగన్మోహన్ రెడ్డి అభీష్టానికి భిన్నంగా ఆయన నిర్ణయాల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని లోపాల పట్ల సొంత పార్టీ నాయకుల నుంచి నిరసన, వ్యతిరేక గళాలు క్రమంగా మొదలవుతున్నాయి. సాధారణంగా తనకు రుచించని మాట ఎవరు చెప్పినా సరే, మంచి చెప్పినా సరే వినే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి.. సొంత పార్టీలోని వారు ఇలా ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంటే ఎలా స్పందిస్తారో అనే చర్చ పార్టీలో జరుగుతున్నది. పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు నెపం నెట్టివేయడం, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడడం చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏకంగా విమర్శ జగన్మోహన్ రెడ్డికే తగిలేలాగా, లోపం ఆయన నిర్ణయాలలోనే ఉందనేలాగా సొంత పార్టీ వారు మాట్లాడడం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఒక వీడియో విడుదల చేస్తూ ఓటమికి కారణం జగన్ విధానాలే అని మెత్తమెత్తగా, పరోక్షంగా చురకలంటించారు. నాసిరకం మద్యం వల్లనే మేము ఓడిపోయాం.. రాష్ట్రంలో మద్యం తాగే అలవాటున్న ఏ ఒకరు కూడా మా పార్టీకి ఓటు వేయలేదు.. పరిస్థితి ఇలా ఉండబోతున్నది అని ముందుగానే గ్రహించి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారికి చెప్పినా సరే వారు మా అభిప్రాయాలను పట్టించుకోలేదు అని కాసు మహేష్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అలాగే తమ ప్రభుత్వపు ఇసుక విధానం వలన పేద ప్రజలు చాలా నష్టపోయారని.. అంతిమంగా తమ పార్టీ నష్టపోయిందని మహేష్ రెడ్డి వివరించారు. తెలుగుదేశం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ లోకి వచ్చిన కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడును బూతులు తిట్టారని, యిలాంటి దురుసు ప్రవర్తన కూడా తమ ఓటమికి కారణమని ఆయన విశ్లేషించారు.
నిజం చెప్పాలంటే కాసు మహేష్ రెడ్డి చెప్పిన మాటలలో కొత్త సంగతి ఏమీ లేదు. కాకపోతే ఆయన మద్యం ఇసుక వ్యాపారాలలో తమ పార్టీ నాయకులు విచ్చలవిడిగా అక్రమాలకు అరాచకాలకు పాల్పడ్డారు అనే మాట సూటిగా చెప్పకుండా.. వాటి వల్లనే తమ పార్టీ ఓడిపోయింది అని నర్మగర్భంగా చెప్పారు. ఇసుక, లిక్కర్ కలిపి జగన్మోహన్ రెడ్డి పార్టీని ముంచేశాయని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చెబుతున్న సంగతే. కాకపోతే జగన్ సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యే స్థాయి గల వారు మాట్లాడటం ఇదే ప్రథమం. ఓడిపోయిన తర్వాత ఇంకొంతమంది నాయకులు కూడా తమ తమ నిరసన గళాలని వినిపించారు గాని వారి ఆరోపణలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి తదితర వ్యక్తుల మీదనే టార్గెట్ చేసినట్టుగా సాగాయి. కానీ కాసు మహేష్ రెడ్డి మాటలు డైరెక్టుగా జగన్ నిర్ణయాలని అటాక్ చేసినట్లుగా కనిపిస్తున్నాయి.
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేరు. కానీ కాసు మహేష్ రెడ్డి ధిక్కార స్వరం ఆయన పార్టీ మేలుకోసమే అనే సంగతి ఆయన గ్రహించాలి. “పోగాలము దాపురించిన వారికి హితవాక్యములు చెవినికెక్కవు” అని పంచతంత్రం నీతి చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి మరింత పతనావస్థ రాసిపెట్టి ఉంటే గనుక మహేష్ రెడ్డి మాటలను ఆయన చెవిన వేసుకోరు.. అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.