వినుకొండలో ఒక హత్య జరిగింది. ఒక నేరం జరిగినప్పుడు కచ్చితంగా ఖండించి తీరాల్సిందే. అయితే కొద్దిగా విచక్షణ ఉండాలి. నేరం జరిగిన తీరు ఒకటైతే, నేరానికి దారితీసిన కారణాలు వేరైతే.. దానికి రాజకీయ రంగు పులిమి వక్రమార్గాలలో లబ్ధి పొందాలని అనుకోవడం చవకబారుతనం అవుతుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మరీ దిగజారుడు రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కేవలం వ్యక్తిగత తగాదాలతో విడిపోయిన ఇద్దరు రౌడీషీటర్లు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం ముదిరి హత్యకు దారి తీసింది. అయితే దీనిని తెలుగుదేశం చేయించిన హత్యగా రంగు పులమాలని జగన్మోహన్ రెడ్డి పడుతున్న తాపత్రయాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
వినుకొండలో హత్యకు గురైన రషీద్, హత్య చేసిన జిలాని ఇద్దరూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకే ముఠా నాయకుడి కింద అనుచరులుగా రౌడీయిజం చలాయిస్తూ ఉండిన వ్యక్తులు. ఏడాది కిందట మొహర్రం నాడు వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. తగాదాపడి కొట్టుకున్నారు అనంతర పరిణామాలలో రషీద్ జిలాని ఇంటి మీదికి వెళ్లి కుటుంబ సభ్యులతో సహా కొట్టడంతో పాటు, అతడి మోటార్ సైకిల్ ను తగలబెట్టాడు. అతడిని హత్యాయత్నం కేసు పెట్టించి జైలుకు పంపాడు. ఆ పాత పగలన్నీ జిలానిలో ఉన్నాయి. వీటన్నింటి పర్యవసానంగా జిలానీ రషీద్ ను హత్య చేయడం జరిగింది.
అయితే ఇది రాజకీయ హత్యగా రంగుపులమడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. బెంగళూరు ప్యాలెస్ లో సేదతీరుతున్న జగన్మోహన్ రెడ్డి, హడావుడిగా ప్రత్యేక విమానం కూడా మాట్లాడుకోకుండా- ఇండిగో విమానం ఎక్కి తక్షణం గన్నవరం చేరుకుని గురువారంనాడు వినుకొండ యాత్ర పెట్టుకోవడం అనేది కేవలం రాజకీయ దుర్బుద్ధుల ప్రేరేపితం. పైగా జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారారంటే రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఈ విషయాలన్నింటినీ ముడిపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పి పోయాయంటూ కేంద్రానికి కూడా లేఖ రాస్తున్నారు. కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని అంటున్నారు. కనీసం తన బాబాయి హత్య గురించి ఇదే స్థాయిలో కేంద్రానికి లేఖ రాసే ధైర్యం జగన్ కు ఉందా అని హోం మంత్రి అనిత ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చర్యలు ఆయననే నవ్వులు పాలు చేసేలా ఉన్నాయి తప్ప, పార్టీ గౌరవాన్ని కాపాడేవి కాదని సొంత పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ మరీ ఇంత దిగజారుడు రాజకీయమా?
Sunday, December 22, 2024