తండ్రి ఆస్తుల్లో చెల్లెలికి న్యాయంగా దక్కవలసిన వాటా ఇవ్వడానికి సుదీర్ఘకాలం ఒప్పుకోకుండా వేధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్లందరూ తనకు అక్కచెల్లెమ్మలని, తాను రాష్ట్రంలోని బిడ్డలందరికీ మేనమామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన వ్యక్తి ఆయన. తీరా రాజకీయాల్లో ఓడలు బండ్లయ్యేసరికి ఆయనకు తత్వం బోధపడింది. చెల్లెలు షర్మిల ద్వారా తనకు జరిగే నష్టమే ఆస్తుల కంటె పెద్దదని భయపడి, న్యాయంగా దక్కవలసిన వాటా ఇవ్వడానికి ఒప్పుకున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అదే ఒప్పందంలో మరో నిబంధనకు కూడా అగీకరించినట్లు తెలుస్తోంది. ఆస్తుల్లో వాటాతో పాటూ… కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన తరువాత.. పొత్తుల్లో భాగంగా కడప ఎంపీ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించడానికి, తద్వారా అక్కడినుంచి షర్మిల విజయానికి సహకరించడానికి కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి చెమటోడ్చి పనిచేసిన షర్మిల పార్టీ తరఫున తనకు రాజ్యసభ స్థానాన్ని ఆశించారు. జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఆ పదవి ఇవ్వలేదు సరి కదా.. ఒక తరంలో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రాజకీయ పదవి అంటూ తానే పాటించలేని నీతులు చెప్పి చెల్లెలికి అన్యాయం చేశారు. దానికి తోడు వారిద్దరి మధ్య రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన ఆస్తులను పంచుకునే గొడవ ఉండనే ఉంది. ఇవన్నీ కలిసి షర్మిల ఆయనకు దూరం జరిగి విభేదించి వెళ్ళిపోయారు.
అనేక పరిణామాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సారధి అయిన షర్మిల 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ఎలా ప్రమాణాలు పాటిస్తున్నాడు.. బాబాయిని హత్య చేసిన వారిని ఎలా కాపాడుతున్నాడు.. తెలియజెబుతూ ఆమె దుమ్మెత్తి పోశారు. జగన్ దళాలకు ఏం జవాబు చెప్పాలో తెలియని పరిస్థితి కల్పించారు. ఏది ఏమైనప్పటికీ ఆ ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడం జరిగింది.
తన మీద ఉన్న సిబిఐ, ఈడీ కేసులు నుంచి రక్షణ కావాలంటే ఏదో ఒక జాతీయ పార్టీ అండ ఉండాలని భావించే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బిజెపి వైరిపక్షంగా ఉన్నది కనుక కనీసం కాంగ్రెస్ జట్టులో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం చెల్లెలు షర్మిల తో ఆస్తులు పంపకానికి అంగీకరించి ఆమె ద్వారా కాంగ్రెస్ జట్టులో చేరడానికి ఉత్సాహపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేవలం ఆస్తులు కాకుండా కడప ఎంపీ సీటు కూడా తనకు ఇవ్వాల్సిందేనని షర్మిల పట్టుబట్టినట్టు సమాచారం. తండ్రి ప్రాతినిధ్యం వహించిన సీటు నుంచి తానే ఎంపీగా నెగ్గుతానని ఆమె అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ జట్టులో చేరితే సీట్లు పంచుకోవడంలో భాగంగా కడప ఎంపీ సీటు చెల్లెలికి ఇవ్వడానికి కూడా జగన్ రెడ్డి గత్యంతరం లేని స్థితిలో అంగీకరించారని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పంచన వైసీపీ చేరడం అనేది నెమ్మదిగా దశలవారీగా జరుగుతుంది అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది
కడప ఎంపీ సీటు చెల్లికి ఇవ్వడానికి జగన్ రెడీ!?
Saturday, December 21, 2024