అందరికీ తెలిసిన ఒక కథను గుర్తుచేసుకుందాం. ఒక పండితుడు పడవలో ప్రయాణిస్తున్నాడు. పడవ నడిపేవాడి పట్ల చులకన భావంతో హేళనగా నీకు వేదాలు వచ్చా, పురాణాలు తెలుసా.. అంటూ రకరకాల ప్రశ్నలు అడిగాడు. అన్నింటికీ సిగ్గుతో తెలియదని చెప్పిన పడవవాడు.. ‘బాబూ మీకు ఈత వచ్చా’ అని అడిగాడు. పండితుడు తెలియదని అనగానే.. ఇప్పుడు పడవ మునిగిపోబోతున్నది బాబూ.. నేను ఈదుకుంటూ వెళ్లిపోతా.. మీరు వేదాలతో పురాణాలతో ఏదోటి చేస్కోండి అని చెప్పి నదిలో దూకి తుర్రుమన్నాడు.. అదీ కథ! ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే..
వందల వేల కోట్ల రూపాయలు నల్లధనం రూపంలో మన చేతికి అందినప్పుడు.. దానిని ఏ రకంగా తెల్లధనంగా మార్చేయాలో చెప్పడానికి ఆయన వద్ద బోలెడు ఉపాయాలు ఉంటాయి! రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఎంత పెట్టాలో.. బంగారం కొనుగోళ్లరూపంలో ఎంత మేరకు రూపం మార్చవచ్చో.. హవాలా రూపేణా ఎంతభాగం విదేశాలకు తరలించవచ్చో.. ఆయన చిటికెలో చెప్పగలరు! సూట్ కేసు, డొల్ల కంపెనీలను ఏ రకంగా సృష్టించాలో తద్వారా వాటిలో పెట్టుబడులుగా నల్లధనం తరలించి.. నెమ్మదిగా ఎలా తెల్లగా చేయాలో ఆయనుకు కరతలామలకం! ఇన్ని రకాల తెలివితేటలు ఉన్న గోవిందప్ప బాలాజీకి పాపం వంట చేసుకోవడం వచ్చో లేదో.. అని ప్రజలు సానుభూతి చూపిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుల్లో ఒకడైన గోవిందప్ప బాలాజీ ప్రస్తుతం రిమాండు ఖైదీగా జైల్లో ఉన్నారు. తనకు మంచమూ దిండూ మస్కిటో కాయిల్స్ వెలగించుకునే అవకాశమూ కావాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు అందుకు ఒప్పుకుంది. కాకపోతే.. నాకు ఇంటినుంచి భోజనం వచ్చేలా అనుమతించమని అడిగితే మాత్రం ససేమిరా కుదరదని చెప్పింది. జైలు కూడు తినవలసిందే అని శాసించింది. కావలిస్తే.. బయటినుంచి కూరగాయలు కొనుగోలు చేసుకుంటే.. గోవిందప్ప జైల్లో తానే వండుకుని తినడానికి అవకాశం కల్పించగలం అని సెలవిచ్చింది.
భారతి సిమెంట్స్ లో పూర్తికాలపు డైరెక్టర్ గా ఆర్థిక వ్యవహారాలను, పెట్టుబడులను మొత్తం శాసిస్తూ ఉండే ఈ ఉద్ధండుడు.. ఇప్పుడు జైల్లో స్వయంపాకం చేసుకుని తినవలసిన పరిస్థితి ఏర్పడినట్టుగా ఉంది. జైలు భోజనం బహుశా వారికి నచ్చడం లేదేమో. అసలే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా జైలు పాలైన తర్వాత ఏకంగా 20 కిలోల బరువు తగ్గిపోయారు. ఇప్పుడు గోవిందప్ప కూడా ఇంటి భోజనం కావాలని అడుగుతున్నారు. లిక్కర్ స్కామ్ లో 3500 కోట్ల రూపాయలు మేర కాజేసిన వాటాలను జగన్మోహన్ రెడ్డి కోసం మతలబులు చేసిన మేధావి గోవిందప్ప బాలాజీకి ఈ జైలు జీవితం ఎంత కష్టంగా ఉన్నదో కదా అని జనం అనుకుంటున్నారు.
గోవిందప్పకు పాపం వంట చేతనవుతుందో లేదో?
Friday, December 5, 2025
