ఒక వ్యక్తి రూపం మాత్రమే గుర్తుకు వచ్చేలాగా ఆయన అనేక రకాలుగా తీవ్రమైన నిందలు వేశారు. అలాగే ఆ వ్యక్తి గురించి మాత్రమే చెబుతున్నట్టు ప్రతి ఒక్కరూ గ్రహించగలిగేలాగా వారి వ్యవహారసరళికి, ధరించే దుస్తులకు, ఇతర ఆహార్యానికి సంబంధించి అనేకమైన లోపలి సంగతులను బయటపెట్టారు. ఆయన ఎవరి గురించి చెప్పదలుచుకున్నారో రాష్ట్రం మొత్తం అర్థం చేసుకుంది. అంతా జరిగిన తర్వాత తూచ్ అనేస్తే అంత ఈజీగా చెల్లుబాటు అయిపోతుందా? ఒకసారి నోరుజారిన తర్వాత ‘నో నో’ అని అన్నంత మాత్రాన ఆ మాటలు చేయగల డ్యామేజీ జరగకుండా ఉంటుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న!
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విషయంలో ఆమెను అవినీతి అనకొండగా. లంఖిణిగా, పూతనగా అభివర్ణిస్తూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనేక విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలుసు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయులైన ఐఏఎస్ అధికారుల్లో శ్రీలక్ష్మి కూడా ఉంటారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న నాటినుంచి జగన్ పాల్పడిన అనేక దోపిడీ వ్యవహారాలకు ఆమె వ్యూహచాతుర్యం, నిర్వహణ ప్రతిభ మద్దతుగా నిలిచాయి. అలాంటి శ్రీలక్ష్మి మీద భూమన విమర్శలు చేసేసరికి సహజంగానే ఆయనకు పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురయింది. జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు ఆయనకు పార్టీ పెద్దలు సంకేతాలు అందించారు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లుగా అర్థమవుతోంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద రిమాండ్ ఖైదీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి తాను శ్రీలక్ష్మి గురించి ఒక మాట కూడా అనలేదని బుకాయించడం గమనించాలి. కానీ ఇలా చెప్పుకున్నంత మాత్రాన చేసిన విమర్శల నుంచి ఆయన తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ విమర్శలలో అధికారిణి ఎవరో చాలా స్పష్టంగానే సూచిస్తూ ఆయన మాట్లాడారు. ఒక ఐఏఎస్ మహిళా అధికారి అనడంతో భూమన ఊరుకోలేదు. మునిసిపల్ శాఖలో పనిచేస్తున్న అని స్పష్టంగా చెప్పారు. అలాగే ఆమె కట్టే చీరలు ఒక్కొక్కటి లక్షన్నర రూపాయలు విలువ చేస్తాయని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన మాటలు శ్రీ లక్ష్మి గురించి మాత్రమే అని అర్థం చేసుకోవడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. అయితే లక్షన్నర విలువైన చీరలను ఇతర ఐఏఎస్ అధికారులు కూడా ఎవరైనా ఏదో ఒక సందర్భంలో కడితే కట్టవచ్చు గాక! ఆ మాటలు కేవలం తన ఉక్రోషం పట్టలేక భూముల అభివర్ణిస్తున్న మాటలుగా తీసిపారేయవచ్చు గాక! కానీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పెట్టుకునే విగ్గుల గురించి కూడా భూమన ప్రస్తావించారు. విగ్గు పెట్టుకునే మహిళా ఐఏఎస్ అధికారులు ఎందరు ఉంటారు? ఈ ఫిల్టర్ వాడినప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ శ్రీలక్ష్మి గురించి మాత్రమే అని చిటికలో చెప్పేయవచ్చు. 50 లక్షల రూపాయల విలువ చేసే 11 విగ్గులు ఆమె వద్ద ఉన్నాయంటూ రోజుకు ఒక విగ్గు పెట్టుకుని తయారవుతుందంటూ భూమన చాలా లేకి, చవక బారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు జగన్ కోసం లెంపలు వేసుకుంటున్నట్టుగా భూమన ఆమె గురించే మాట్లాడలేదు అంటూ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకోవడం చిత్రంగా కనిపిస్తోంది.
నోరుజారిన తర్వాత నో అంటే కుదురుతుందా?
Thursday, December 4, 2025
