సార్వత్రిక ఎన్నికల తర్వాత.. అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు ఊరట. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నిలబెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీకి దిగకుండా హుందా రాజకీయాలు కొనసాగించాలని అనుకోవడంతో.. ఎమ్మెల్సీగా బొత్స గెలుపు లాంఛనం అయింది.
ఈ స్థానానికి ఇండిపెండెంటుగా నామినేషన్ వేసిన షఫీ, ఉపసంహరించుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయింది. అయితే ఇదేదో పెద్ద సెలబ్రేషన్ లాగా వైసీపీ దళాలు పండగ చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పార్టీకి దక్కిన తొలివిజయం ఇది అని వారు మురిసిపోతున్నారు.
అయితే వారు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని చూసుకుని జగనన్న దళాలు అంతగా మురిసిపోవడం అవసరమా అని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. ఇది వారికి దక్కిన ‘విజయం’ కాదు. వారి స్థానాన్ని వారు నిలబెట్టుకున్నారు.. అంతే! ఈ మాత్రం దానికే ఇంతగా మురిసిపోవడం మిడిసిపాటు కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం ఓటర్లలో 75 శాతం ఓట్లు తమ పార్టీ చేతిలోనే ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ సీటు విషయంలో భయపడ్డారు. వారినందరినీ బెంగుళూరులో శిబిరాలకు తరలించారు. వారందరికీ కుటుంబాలతో సహా విహార యాత్రలు ఏర్పాటుచేశారు. వారు భవిష్యత్తు గురించిన ఆలోచనతో పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు లక్షలకు లక్షలు గుమ్మరించారు.
వైసీపీ నేతలు వారితో లోపాయికారీగా.. ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు పార్టీ మారవద్దని, కావలిస్తే ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిపోయినా కూడా పర్లేదని బతిమాలినట్టు కూడా పుకార్లు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో చచ్చీ చెడి చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అయ్యారు. ఆ ఎన్నిక ఏకగ్రీవం అనిపించుకున్నారు. ఈ విజయాన్ని చూసుకుని మురిసిపోయే అవసరం ఎంతమాత్రమూ లేదని ప్రజలే కాదు.. వైసీపీ శ్రేణులు కూడా అనుకుంటున్నాయి.