వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్న ఉన్నతాధికారుల మీద ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తోంది. తమకు ఎప్పటికప్పుడు అందుతున్న ఫిర్యాదులను బట్టి, వాటితో పాటు వచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించి.. అవి నిజమని తేలితే వారిని విధులనుంచి తప్పిస్తున్నారు. అయితే విధులనుండి తప్పిస్తున్న అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించడం అనే ప్రక్రియ మాత్రం ప్రహసనప్రాయం అవుతోంది. ఇలాంటి అభిప్రాయం ప్రజలకు కలగడానికి సీఎస్ జవహర్ రెడ్డి నిర్ణయాలు కారణం అవుతున్నాయి. సీఎస్ జవహర్ రెడ్డి తానుకూడా అధికారపార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారా? లేదా, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారా? ఆయన కాదనలేని స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
కొన్ని వారాల కిందట ఈసీ అయిదుగురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. వారి స్థానంలో నియమించేందుకు ఒక్కోపోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ ల పేర్లను పంపాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఆయన పంపిన ప్యానెల్ పేర్లలోని ఐపీఎస్ లు అందరూ కూడా.. అధికార పార్టీకి అనుకూలురుగా ముద్రపడిన వారే కావడం విశేషం. ఆ ప్యానెల్ కూర్పుపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఈసీ కి సంబంధించినంతవరకు వచ్చిన ప్యానెల్ పేర్లలో ఒకరిని సెలక్ట్ చేసి నియమించడం మాత్రమే చేయగలదు. ఆ నేపథ్యంలో.. వారు మళ్లీ అధికార పార్టీ తొత్తులే అయినా నియంత్రించడం అనేది ఉండదు. అలా కొత్తగా వచ్చిన ఐపీఎస్ లు కూడా వివాదాస్పద వ్యక్తులుగానే తయారయ్యారు. ఆయా జిల్లాల్లో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగుపడలేదని అనేక ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ నగర కమిషనర్ లను ఈసీ మార్చేసింది. ప్రస్తుతం నియమితులైన వారు నిష్పాక్షికమైన అధికారులుగా ముద్ర ఉన్నవారు. నియామకాలు బాగానే ఉన్నాయి గానీ.. ప్యానెల్ కింద సీఎస్ జవహర్ రెడ్డి సిఫారసు చేసిన పేర్లు మళ్లీ వివాదాస్పదం అవుతున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయుల్ని తప్పించగా, ఆయనను మించి అధికార పార్టీ కార్యకర్తలాంటి వాడని ముద్రపడిన సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును ప్యానెల్ లో పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ వారు ఏం చెబితే అదే చేసే అధికారిగా సంజయ్ కు అపకీర్తి ఉండగా.. ఆయన పేరును సీఎస్ ప్యానెల్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది ప్రశ్న. చంద్రబాబు అరెస్టు దగ్గరినుంచి, హైదరాబాదు ఢిల్లీ ప్రెస్ మీట్ల వరకు అంతా వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించిన వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్యానెల్ లో పెట్టడానికి సీఎస్ జవహర్ రెడ్డి ఒత్తిళ్లకు లోనయ్యారా అనే వాదన కూడా ఉంది.
అందుకే అసలు డీజీపీ, సీఎస్ లను కూడా మారిస్తే తప్ప రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరగవనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
సీఎస్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారా?
Sunday, November 17, 2024