‘ఉపకారికి ఉపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
అపకారికి ఉపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
అని మనకు శతకకారుడు నేర్పాడు. చంద్రబాబునాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అలాంటి సానుభూతి చూపిస్తున్నారా? ఆయనకు జగన్ మీద జాలి కలుగుతోందా? అని ప్రజలు సెటైర్లు వేసుకుంటున్నారు. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. అందులో జరిగిన అవినీతి గురించి చాలా కనీసపు లెక్కలు చూపించారని ప్రజలు అంటున్నారు. ఎంతగా అంటే.. చంద్రబాబు శ్వేతపత్రంలో చూపించిన అవినీతి మోతాదును.. ఆయన కూటమి భాగస్వామి పార్టీలే ఆమోదించలేకపోతున్నాయి. చంద్రబాబు పదిశాతం అవినీతినే చెబుతున్నారని తమ నాయకుడినే విమర్శిస్తున్నాయి.
మద్యం కంపెనీల నుంచి జగన్ అండ్ కో 3113 కోట్ల రూపాయల కమిషన్లు స్వాహా చేశారని చంద్రబాబునాయుడు గణాంకాలు వివరించారు. అయితే దీనిపై చర్చ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గానీ, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గానీ ఈ లెక్కలను ఖండించారు. జగన్ అండ్ కో కనీసం 30 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలు వింటే జగన్ చాలా హేపీ ఫీలవుతారని వాళ్లు జోకులు వేయడం విశేషం.
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 99 వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరగ్గా.. అందులో కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ చెల్లింపులతో జరిగాయి. అదంతా 2023లో మాత్రమే. అప్పటిదాకా ఎంత దోచుకున్నారనేది కూడా ఇదమిత్థంగా లెక్కతేలదన్నమాట. చంద్రబాబునాయుడు మూడువేల అవినీతి అంటున్నారు గానీ.. నిజానికి పవన్, విష్ణుకుమార్ రాజు చెప్పే గణాంకాలే నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. చంద్రబాబు అధికారికంగా రికార్డు అయిన మద్యం అమ్మకాల మొత్తాన్ని మాత్రమే చెబుతున్నారు. కేవలం నగదు చెల్లింపుల ముసుగులో, అలాగే బిల్లులు కూడా ఇవ్వకుండా సాగించిన దందాల్లో బీభత్సంగా అంతకు రెట్టింపు వ్యాపారం జరిగి ఉంటుందనేది ప్రజల అంచనా.
ఈ చర్చ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నాసిరకం మద్యంతో ప్రజల డబ్బును, ఆరోగ్యాన్ని కూడా దోచుకున్నారని, సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతో సభకు రాకుండా పారిపోయారని అన్నారు.
అకారణంగా.. నేరమే లేని కేసులో తనను అరెస్టు చేయించి జైలు పాల్జేసిన జగన్మోహన్ రెడ్డి పట్ల.. చంద్రబాబు అపకారికి ఉపకారము స్టయిల్లో.. ఆయన చేసిన నేరాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని జనం అనుకుంటున్నారు.
జగన్ పట్ల చంద్రబాబు జాలి చూపిస్తున్నారా?
Sunday, December 22, 2024