రామోజీ, చంద్రబాబులను వేధించిన ఐపీఎస్ పై వేటు!

Wednesday, December 18, 2024

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజ్యం చేసినరోజుల్లో ఆయన వ్యవస్థలను తన ఇంటి పాలేర్లలాగా వాడుకున్నారనే ఆరోపణ సర్వత్రా వినిపించింది. పోలీసులను పూర్తిగా తమ చెప్పుచేతల్లో ఉంచుకుని చెలరేగిపోయారు. ప్రత్యేకించి.. తన ప్రత్యర్థుల్ని వేధించడానికి, కేసుల రూపంలో రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి రాష్ట్ర సీఐడీ విభాగాన్ని జగన్మోహన్ రెడ్డి ఉసిగొల్పే వారనే సంగతి అయిదేళ్లు కాలంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇలాంటి సీఐడీ వేధింపులలో కూడా తనకు అత్యంత శత్రువులు అయిన చంద్రబాబునాయుడు, రామోజీరావు లను వేధించడానికి, వారిని తనకు నచ్చే విధంగా, తాను మెచ్చే విధంగా ఇబ్బంది పెట్టడానికి చేతిలోని ‘టూల్’ లాగా ఉపయోగపడిన అప్పటి సీఐడీ చీఫ్, సీనీయర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ మీద ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ సీఐడీ చీఫ్ గా జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం సేవలు అందించడానికి పూర్వం.. ఎన్.సంజయ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అధికారిక హోదాను అడ్డు పెట్టుకుని దాదాపు కోటిరూపాయల అక్రమాలకు పాల్పడినట్టుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వారు తేల్చారు. దీంతో ప్రభుత్వం ఎన్.సంజయ్ ను సస్పెండ్ చేస్తూ పూర్తిస్థాయి. విచారణకు ఆదేశించింది.


వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రతి సందర్భంలోనూ తన రాజకీయ ప్రత్యర్థుల మీదికి ఏపీ సీఐడీ విభాగాన్ని ఉసిగొల్పుతూ వచ్చారు. వైసీపీ ఎంపీ  రఘురామక్రిష్ణరాజు మీద రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టు చేసి తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయాలలో సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్నారు. రఘురామక్రిష్ణ రాజు తన మీద జగన హత్యాయత్నం చేయించారంటూ పెట్టిన కేసులో అప్పటి సీఐడీ చీఫ్ హోదాలో సునీల్ కుమార్ కూడా నిందితుడిగా ఉన్నారు. కానీ తర్వాతి కాలంలో సునీల్ కుమార సేవలు జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. ఉన్నపళంగా డీజీపీని మార్చేసినట్టే.. ఎంతటి విధేయతతో సేవలు అందిస్తున్నప్పటికీ.. సునీల్ కుమార్ ను మార్చేసి ఎన్.సంజయ్ ను ఆ స్థానంలోకి తెచ్చారు.


చంద్రబాబునాయుడును అరెస్టు చేసి అత్యంత అరాచకమైన రీతిలో హింసాత్మకంగా ఆయనను రోడ్డు మార్గాన రాత్రంతా తరలించి విచారించి జైలు పాల్జేయడంలోనూ, ఈనాడు అధినేత రామోజీరావును మార్గదర్శి మీద కేసుల నెపంతో, అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉండగా విచారణ అంటూ వేధించిన తీరు ఇవన్నీ కూడా ఎన్.సంజయ్ ను అత్యంత వివాదాస్పదుడిగా నిలబెట్టాయి. పైపెచ్చు ఈ రెండు కేసుల వ్యవహారంలోనూ ఒకవైపు విచారణ సాగుతూ ఉండగా.. సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ రాజకీయ నాయకుల తరహాలో హైదరాబాదు ఢిల్లీల్లో ప్రెస మీట్లు పెట్టి.. అప్ డేట్లు ఇవ్వడం కూడా చాలా వివాదాస్పదం అయింది. జగన్ భక్తితో అమితంగా తరించి పోయిన సంజయ్ ను ఎన్డీయే కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. కాగా, ఆయన పాత అగ్నిమాపక శాఖలో చేసిన పాపాలు పండడంతో ఇప్పుడు ఆయన సస్నెన్షన్ కు గురయ్యారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles