బాలినేని పై  వైసీపీలో అంతర్గత కుట్ర!

Wednesday, January 22, 2025

జగన్మోహన్ రెడ్డి మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ మీద అలిగి పక్కకు తప్పుకోవడానికి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పిలిచి జిల్లా పార్టీ సారథ్యం అప్పగించాలని అనుకుంటూ ఉన్నప్పటికీ, ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనకు అనేక రకాల అవమానాలు ఎదురయ్యాయని తీరా పార్టీ పరాజయం పాలైన తర్వాత, ఇప్పుడు మాత్రం సారథ్యం చేపట్టి బరువు మోయమంటే ఎలా అని బాలినేని ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు వైయస్సార్సీపీలో కొనసాగకుండా ఉండడానికి పార్టీలోనే అంతర్గతంగా ఒక కుట్ర జరుగుతున్నది.. అనే ప్రచారం ఉంది.

చాలా కాలం నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పట్ల, జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల విముఖంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు నుంచి పార్టీ అధిష్టానంతో ఆయనకు విభేదాలు ఉన్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం మీదనే ఆయన సుదీర్ఘంగా జగన్తో పోరాడి విఫలమయ్యారు. పైగా చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డిని తీసుకువచ్చి ఒంగోలు జిల్లా పార్టీ మీద రుద్దడం కూడా ఆయనకు ఇష్టం లేదు. మొత్తానికి పార్టీ పరాజయం పాలైన తర్వాత ఆయన ఒంగోలు వైపు తిరిగి మళ్లి చూడలేదు. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో.. ఒకే ఒక్కసారి ఇక్కడకు వచ్చిన బాలినేని కొందరితో మంతనాలు సాగించారు. ఫలించలేదు. అప్పుడు మళ్లీ హైదరాబాదు వెళ్లిపోయిన ఆయన తిరిగి ఒంగోలుకు రాలేదు. ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేజారింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన మళ్లీ జగన్ తో కూడా సమావేశం అయ్యారు.

ఇదే సమయంలో, బాలినేని పార్టీని వీడుతారని జనసేనలో చేరుతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఇదంతా డ్రామా అని పార్టీలోని కొందరు ఒక ప్రచారం పుట్టించారు. బాలినేని మీద పార్టీలో మరో కుట్ర జరుగుతుందని కార్యకర్తలు కొందరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వద్ద తన విలువ పెంచుకోవడానికి, ప్రయారిటీ పెంచుకోవడానికి ఆయన పార్టీని వీడుతారని డ్రామా ఆడుతున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అది కేవలం డ్రామా అనడం ద్వారా జగన్- బాలినేనికి ఎప్పటికీ ప్రాధాన్యం ఇవ్వకుండా చూడాలని పార్టీలోని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం ఉంది. వారితో బాలినేనికి తొలినుంచి ఆధిపత్యతగాదాలు ఉన్నాయి. అలాంటి శక్తులు ఇదే అదనుగా చూసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి వైయస్సార్సీపీలో కొనసాగకుండా చూడాలని, పొమ్మనకుండా పొగ పెట్టి బయటకు గెంటేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా గుసగుసలు ఉన్నాయి. జనసేనతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ మంతనాలు సాగించి అక్కడ చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ.. అదంతా డ్రామా అనే ప్రచారం ద్వారా మామయ్య బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ ఇచ్చే ప్రాధాన్యానికి కోత పెట్టడానికి మాత్రం కుట్ర జరుగుతోంది. బాలినేని శ్రీనివాస రెడ్డి ఇతర పార్టీలోకి వెళ్లడం అంటూ జరిగితే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపికి అది చాలా పెద్ద కుదుపు అవుతుంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles