‘దీపం’ వెలుగుల్లోనే సూపర్ సిక్స్‌కు శ్రీకారం!

Tuesday, October 22, 2024

ఈ దీపావళి పర్వదినం నాడు ఏపీలోని పేదల ఇళ్లలో సరికొత్త వెలుగులు నిండబోతున్నాయి. వారు చేసుకునే పండగ వెలుగుజిలుగుల ఆనందం మాత్రమే కాదు.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వారి కుటుంబాలకు పంచుతున్న సరికొత్త వెలుగులు కూడా జత కానున్నాయి. దీపం పథకం కింద ప్రతి పేద మహిళకు ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకానికి  చంద్రబాబు ప్రభుత్వం ఈ దీపావళి పర్వదినం నాడే శ్రీకారం చుట్టబోతోంది. దీంతో సూపర్ సిక్స్ హామీలలో ఒకటి అమలులోకి వచ్చినట్టు అవుతుంది. ఒక్కటొక్కటిగా సూపర్ సిక్స్ హామీలు అన్నింటినీ అమలులోకి తీసుకురావనికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని వీరి తాజా నిర్ణయం ద్వారా స్పష్టం అవుతోంది.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కనీసం ఆరునెలలైనా వారు కుదురుకుని పని ప్రారంభించడానికి సమయం ఇద్దామన ధ్యాస కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు లేదు. ఇంకా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదంటూ వారు నెలలబట్టీ గోల చేస్తున్నారు. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్రాంతి వరకు ఏమీ రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని అనుకున్నామని.. కానీ ఇప్పుడే విమర్శలు చేయాల్సి వస్తున్నదని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ తీరు మరీ విచిత్రం. మీడియాతో మాట్లాడే అవకాశం వస్తే చాలు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది.. ఇప్పుడు ఎన్నికలొచ్చినా ఓడించేస్తారు.. సూపర సిక్స్ హామీల పేరుతో చంద్రబాబు మోసం చేశారు అంటూ మొసలి కన్నీరు కారుస్తారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వారికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని.. ఒక దాని తర్వాత ఒకటి ఒక ప్లాన ప్రకారం చే సుకుంటూ పోతారని బహుశా ఆయనకు అవగాహన ఉండకపోవచ్చు. ఒకవేళ తనను గెలిపిస్తే వృద్ధుల పింఛను 500 పెంచడానికి అయిదేళ్ల సమయం అడిగిన జగన్.. చంద్రబాబు మాత్రం నాలుగు నెలలు గడవక ముందే.. మేనిఫెస్టోలోని సకలం చేసేయాలని నిలదీయడం పెద్ద కామెడీ. ఇప్పుడు దీపం పథకం రూపంలో సూపర్ సిక్స్ అమలు మొదలు పెట్టడం జగన్ కోటరీకి షాక్ అని చెప్పాలి.
మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వలన ప్రభుత్వానికి అయిదేళ్లలో 13,423 కోట్ల రూపాయల భారం పడుతుందని అధికారులు లెక్కలు వేశారు. సాధారణంగా ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.876 గా ఉంది. రూ.25 రాయితీ పోగా మిగిలిన రూ.851 ని ఏపీ సర్కారు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రతి నాలుగునెలల వ్యవధిలో ఎప్పుడో ఒకసారి వారు ఈ పద్ధతిలో సిలిండరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి బాబు సర్కారు తాజా నిర్ణయం పట్ల మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles