ఒక నాయకుడిని ప్రజలు ఆదరించి, ప్రేమించి ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపిస్తే.. ఆ నాయకుడు ఎప్పుడు కనిపించినా సరే వారు అక్కున చేర్చుకుంటారు. ఆదరిస్తారు. అదే ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా^ దొంగ ఓట్లు వేయించుకుని అరాచకాలు సృష్టించడం ద్వారా ఎవరైనా ప్రజాప్రతినిధిగా గెలిచినా కూడా వారికి అధికారం దక్కుతుందేమో కానీ ప్రజల ప్రేమ మాత్రం దొరకదు. ఈ విషయమే ఇప్పుడు తంబళ్లపల్లె నియోజకవర్గంలో నిరూపణ అవుతోంది.
తంబళ్లపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నియోజకవర్గానికి వెళితే పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు తమ నిరసనలు తెలియజేశారు. ద్వారకనాథరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమిళనాడు నుంచి, పుంగనూరు నుంచి వెంట తెచ్చుకున్న కిరాయి రౌడీలు మారణాయుధాలతో ఆయన తనకు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇటీవల ఎన్నికల్లో గెలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లెక్క వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండే రెండు సీట్లలో తంబళ్లపల్లి కూడా ఒకటి. ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి గెలిచారు. అయితే పెద్దిరెడ్డి సోదరులకు దొంగ ఓట్లు అనేవి ఒక ట్రేడ్ మార్క్ అనే భావన ప్రజలలో ఉంది.
తిరుపతి ఎంపీ స్థానానికి గతంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లారీలలో వేల మంది జనాన్ని తరలించి వారందరితో దొంగ ఓట్లు వేయించారనే ప్రచారం కూడా ఉంది. పుంగనూరులో కూడా ఆయన అలాగే గెలిచారని ఇప్పటికీ అంటుంటారు. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి కూడా కేవలం దొంగబాట్ల ద్వారానే గెలిచారు అనేది స్థానికుల ఆరోపణ. అందుకే ఆయన నియోజకవర్గానికి రాగానే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.
నిజానికి స్థానికులు ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించడానికి కూడా ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని వెనక్కు పంపారు. నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలుగా మిగిలిన వారంతా ఆయన నివాసం వద్ద మోహరించి నిరసనలు తెలియజేస్తున్న ప్రజలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేసి గెలిచినప్పటికీ పెద్దిరెడ్డి సోదరుల ప్రభావానికి గండిపడినట్టే లెక్క! వైసిపి అధికారంలో ఉన్నంతకాలం వీరు విచ్చలవిడిగా చెలరేగిపోయిన మాట నిజమే. అయితే ఇప్పుడు పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడుకు మిధున్ రెడ్డి ఇద్దరూ భారతీయ జనతా పార్టీలో చేరుతారని ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా బలంగా ఉండే తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి కనీసం అలాంటి అవకాశం అయినా ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. అక్రమాలు చేసి ఎన్నికల్లో గెలిచిన ద్వారకనాథరెడ్డి బావుకున్నది ఏమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.