వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేలా ప్రతిరోజూ సరికొత్త హామీలతో ప్రచారపర్వంలో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. అదే సమయంలో.. ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేని అప్పుల ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి, ఒక్క రూపాయి అదనంగా ఖర్చు కాగల కొత్త హామీ ఇవ్వాలన్నా సరే జడుసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెబుతున్న సరికొత్త హామీలతో పోటీపడి వాటిని ఫాలో కావాలంటే ఆయనకు ఈగో అడ్డు వస్తోంది. అదే సమయంలో.. అవన్నీ కూడా ప్రజాకర్షక హామీలే కావడంతో వాటిని ఇగ్నోర్ చేస్తే కొంప మునుగుతుందనే భయం కూడా వెన్నాడుతోంది.
చంద్రబాబునాయుడు తాజాగా బీసీలపై మరో అద్భుతమైన అస్త్రం ప్రయోగించారు. బీసీ వర్గాలకు చెందిన పేదలు అందరికీ యాభయ్యేళ్లకే వృద్ధాప్య పింఛను నాలుగువేల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. బీసీ ఉద్యమ నాయకుడు జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆయన ఈ హామీ ఇవ్వడం విశేషం. లక్షలాది మంది బీసీ వర్గాల్లో ఈ హామీ విపరీతమైన ప్రభావం చూపిస్తుంది అనడంలో సందేహం లేదు.
పింఛనుదారులే తనకు స్థిరమైన ఓటు బ్యాంకు అని జగన్ అనుకుంటూ సాగుతున్న తరుణంలో.. చంద్రబాబునాయుడు ఆ వర్గాన్ని బహుముఖంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ సర్కారు ఇస్తున్న పెన్షను 3000 మాత్రమే కాగా, తాను 4000 రూపాయల వంతున ఏప్రిల్ నుంచి అరియర్స్ సహా ఇస్తానని చంద్రబాబు ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు. అలాగే వికలాంగులకు 6000 ఇస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. తాజాగా బీసీలకు యాభయ్యేళ్లకే పింఛను అని చెప్పడం కూడా చాలా గట్టి హామీగా ప్రజలు భావిస్తున్నారు. ఈ హామీ కూడా ఓటింగ్ సరళిని తారుమారు చేయగలదని విశ్లేషణలు సాగుతున్నాయి.
అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ హామీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. పింఛన్ల విషయంలో మనం కూడా రాజీపడి ఒక మెట్టు దిగి ఏదో ఒక బాబు హామీని కాపీ కొట్టేలా ఒక మాట చెప్పాల్సిందేనని వైసీపీ కీలక వ్యూహకర్తలు జగన్ కు సూచించినట్టు సమాచారం. అయితే అలా చేయడం వల్ల.. చంద్రబాబును ఫాలో అవుతున్నాం అనే పేరు వస్తుందని, అది తమకు చాలా నష్టం అని ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది. మరి ముందు ముందు ఆయన ఏ కొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు వస్తారో చూడాలి.
కాపీ కొట్టాలంటే ఈగో.. ఇగ్నోర్ చేయాలంటే భయం!
Sunday, December 22, 2024