ఎన్డీయే కూటమి తరఫున చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసి తమ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాగానే చంద్రబాబునాయుడు కూడా ఆరుపేజీల మేనిఫెస్టో డాక్యుమెంట్ ను రూపొందించారు. కానీ.. వారికి వీరికి హస్తిమశకాంతరం అనదగినంతటి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మొత్తం అది చేశాం.. ఇది చేశాం అనే మాటలతోనే నింపేసి.. మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో ఒకటి రెండు ముక్కలు మాత్రమే వివరించారు. అదే కూటమి మేనిఫెస్టోలో అడుగడుగునా వరాలే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఈ మేనిఫెస్టో కాపీని ప్రజలు పూర్తిగా చదివితే.. కూటమి అభ్యర్థులకు ఓటు వేయకుండా ఉండడం కష్టం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి.. తాను సంక్షేమ పథకాలు ప్రారంభించానని చెప్పుకుంటూ.. ఇళ్లకే డబ్బు చేరవేయడం అనే ఒకే మాట మీద ఆశ పెంచుకుని.. మళ్లీ గెలుస్తానని అనుకుంటున్నారు. కానీ.. జగన్ సర్కారు అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. ఏ ఒక్కటి కూడా నిలిపివేయకుండా.. ప్రతి పథకంలోనూ కనీసం వెయ్యిరూపాయలు పెంచి పేదలకు అందిస్తాం అని చంద్రబాబు ప్రకటించడం ఆసక్తికరం. పింఛన్ల విషయంలో తెదేపా హామీ గతంలోనే వచ్చినప్పటికీ.. ఇటీవల చెప్పినట్టుగా 2024 ఏప్రిల్ నుంచి పెంచుతూ అరియర్స్ సహా జులై నెలలో ఏడువేలు ఇస్తాం అన్న మాటను కూడా ఇందులో పొందుపరిచారు. జగన్ ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు 20వేలు జీతం చేస్తానని అంటే.. చంద్రబాబు పాతికవేలు చేస్తానని ప్రకటించారు. అలాగే జూనియర్ లాయర్లకు జగన్ నెలకు రూ.5వేలు ఇస్తుండగా.. పదివేలు వంతున ఇస్తానని చంద్రబాబు అనడం విశేషం.
ప్రత్యేకించి వాలంటీర్ల విషయంలో గమనించాలి. వాలంటీర్లంతా తమ పార్టీ కార్యకర్తలే అని వైసీపీ విర్రవీగింది. చంద్రబాబునాయుడు వారి వేతనాలను పదివేలకు పెంచుతానని అనేసరికి వారందరూ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తారేమో అనే భయంతో వారందరితో కుట్రపూరితంగా రాజీనామాలు చేయించడానికి ప్రయత్నిస్తోంది. వాలంటీర్లకు ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు మేనిఫెస్టో డాక్యుమెంట్ లో ప్రముఖంగా తెలియజెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమానంగా వరాలను అందించేలా తెదేపా మేనిఫెస్టో ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది చూస్తే కూటమికి ఓటు వేయకుండా ఉండలేరు!
Thursday, November 21, 2024