ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తమకు ఒక మంచి అవకాశం కలిసి వచ్చిందని మురిసిపోతున్నారు. తనను మించిన వాడు లేనేలేడని విర్రవీగే నాయకుడిని ఒకసారి కాదు కదా.. రెండు సార్లు ఓడిస్తే ఆ మజానే వేరప్పా.. అని ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి అవకాశం ఇప్పుడొచ్చిందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికకు గానీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ దాదాపుగా ఖరారవడంతో తెలుగుదేశం నాయకుల్లో ఈ ఆలోచన కలుగుతోంది. బొత్సను ఎమ్మెల్సీగా కూడా ఓడించాలనుకుంటున్నారు.
గత అయిదేళ్ల ప్రభుత్వ కాలంలో.. జగన్ తర్వాత.. అంతే అహంకారంతో తమను మించిన వారు లేరన్నట్టుగా తమకు కొమ్ములు వచ్చినట్టుగా చెలరేగిన కొద్ది మంది మంత్రులు, కీలక నాయకుల్లో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతారని తెలుగుదేశం వాళ్లు కూడా అనుకోలేదు. బొత్స మీద మోహరించడానికి చంద్రబాబునాయుడు చాలా వ్యూహరచన చేయాల్సి వచ్చింది. ఆర్థికంగా బలమైన గంటా శ్రీనివాసరావును పోటీ పెట్టాలనుకున్నారు గానీ.. ఆయన ఒప్పుకోకపోవడంతో చివరికి ఆ బాధ్యత కళా వెంకట్రావు మీద పడింది.
బొత్సను ఓడించడం ఈజీకాదు అనే ఉద్దేశంతోనే కళా వెంకట్రావు బరిలోకి దిగినా.. జగన్ సర్కారు మీద వ్యతిరేకతతో వెల్లువెత్తిన జన ప్రభంజనం బొత్సను దారుణంగా ఓడించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వంతు వచ్చింది. నిజానికి ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల్లో 75 శాతం ఓట్లు వైసీపీకే ఉన్నాయి. కానీ.. ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ యావత్ ఉత్తరాంధ్రలో సర్వభ్రష్టత్వం చెందిపోయింది. అంటే తమ ప్రాంత ప్రజలు వైసీపీని ఏ స్థాయిలో ఛీత్కరించుకుంటున్నారో.. స్థానిక సంస్థల నేతలందరికీ చాలా స్పష్టంగానే అర్థమైంది. వారిలో తమ భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో అనే భయం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో వారంతా కూటమి పార్టీల వైపు చూపు సారిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి సహకరించే ఆలోచనతో ఉన్నారు. ఆ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని.. వారి ఓట్లు వేయించుకోగలిగితే.. బొత్సను ఎమ్మెల్యే ఎన్నికతో పాటు, ఎమ్మెల్సీగా కూడా ఓడించవచ్చునని తెలుగుదేశం భావిస్తోంది. ఆ పార్టీ తరఫున గండి బాబ్జీ పోటీచేయబోతున్నారు. తాను కొమ్ములు తిరిగిన నాయకుడిని అనుకునే బొత్స సత్యనారాయణను రెండుసార్లు ఓడిస్తే ఆ మజానే వేరప్పా అనుకుంటున్నారు.
రెండుసార్లు ఓడిస్తే ఆ మజానే వేరప్పా!
Tuesday, November 12, 2024