సిట్ ఎదుట మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సాక్షిగా విచారణకు హాజరయ్యారు. తాను చెప్పదలచుకున్నది మాత్రం చెప్పారు. దాచదలచుకున్నది మాత్రం దాచారు. ఆయన అన్ని నిజాలను పారదర్శకంగా చెప్పేశారని అనుకోవడానికి వీల్లేదు. తెలియదు గుర్తులేదు బాటను ఆయన కూడా అనుసరించారు. ఆయన ప్రధానంగా రాజ్ కసిరెడ్డిని పీకల్దాకా ఇరికించేయడానికి ఈ విచారణ పర్వాన్ని వాడుకున్నారని మాత్రం అర్థమవుతోంది. అయితే విచారణ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో వెల్లడించిన సంగతులను బట్టి కొన్ని సందేహాలు రేగుతున్నాయి. ఆయన దాస్తున్న వాటిలో ఒకటిరెండు అయినా క్లారిటీ ఇస్తే.. అనేక చిక్కుముడులు వీడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
2014 నుంచి 2019 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన సమస్త వ్యవహారాలను తాను మాత్రమే సింగిల్ హ్యాండెడ్‌గా నడిపించానని విజయసాయి సొంత డప్పు కొట్టుకున్నారు. ఆ సమయంలో పార్టీకి తానే సర్వనిర్ణయాధికారాలు కలిగిఉన్నానన్నట్లుగా చెప్పుకున్నారు. అప్పట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పార్టీలోని కొందరు పెద్దలు తన వద్దకు తీసుకువచ్చి పరిచయం చేశారని చెప్పారు. ఆయనది క్రిమినల్ బ్రెయిన్ అని.. ఆ విషయం తాను అప్పట్లో గుర్తించలేకపోయానని కూడా చెప్పారు.
అయితే కీలకంగా కలుగుతున్న సందేహం ఏంటంటే.. కసిరెడ్డిని విజయసాయికి పరిచయం చేసిన పెద్దలు ఎవ్వరు? ఆ సంగతి ఆయన బయటపెడితే ఈ కేసు విషయంలో అనేక చిక్కుముడులు వీడిపోయే అవకాశం ఉంది.
పార్టీలో ఒకరి పెత్తనం నడుస్తున్నదంటే.. అనేకమందిని నాయకులు వారికి పరిచయం చేస్తూ ఉంటారు. కానీ.. కసిరెడ్డి పరిచయం అయ్యాక విజయసాయి ఆయనకు అనేక కీలక బాధ్యతలు అప్పగించారు. తొలుత ఐటీవిభాగం, తర్వాత విజయసాయి పార్టీకి వెన్నెముకలాగా తయారుచేసిన సోషల్ మీడియా, ఆ తర్వాత ఏకంగా స్ట్రాటెజిస్టు ప్రశాంత్ కిశోర్ తో సమన్వయం.. ఇవన్నీ చిన్న సంగతులు కాదు. ఇంత కీలక బాధ్యతలు అప్పగించారంటే.. కసిరెడ్డిని పరిచయం చేసిన వారు ఎవరో చాలా కీలకమైన వ్యక్తులే అయి ఉండాలి. వారు ఏ లక్ష్యాలతో కసిరెడ్డిని విజయసాయి కోటరీలోకి చొప్పించారో కూడా నిగ్గు తేలాలి. విజయసాయి వారి పేరు బయటపెడితే.. ఆ సంగతులు కూడా తేలుతాయి. అశ్వత్థామ హతః కుంజరః అని ధర్మరాజు అన్నట్టుగా విజయసాయి తనకు ప్రయోజనం కలిగించే విషయాలు మాత్రం బయటపెట్టి, వాటితో ముడిపడి ఉన్న అనేక ఇతర సంగతులను బయటపెట్టకుండా దాపరికం ప్రదర్శిస్తే కేసు తేలదు సరికదా.. విజయసాయి ప్రతి మాట మీద కూడా కొత్త అనుమానాలు పుడతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పరిచయం చేసిందెవరో తెలిస్తే చిక్కుముడి వీడుతుంది!
Friday, December 5, 2025
