ఏమో.. రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. ఇదేమీ విశేషం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ దారుణంగా ఓడిపోయి ఉండవచ్చు. రేప్పొద్దున ఏదో ఒక నాటికి మళ్లీ గెలుస్తారేమో. ఎటూ ఆయన కోటరీ మనిషిగానే ముద్ర పడింది గనుక.. మరింతగా ఆయన గుడ్ లుక్స్ లో పడడానికి, ఆయన కళ్లలో ఆనందం చూడడానికి హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తే పోలా.. అనుకున్నట్టున్నారు.. మాజీ జర్నలిస్టు పోలా విజయబాబు. అనుచితమైన అంశాన్ని పట్టుకుని ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటూ.. రాజకీయ ప్రయోజనాలకోసం పిటిషన్ వేసినందుకు హైకోర్టు గట్టిగానే గడ్డిపెట్టింది. సోషల్ మీడియాలో అసభ్య, బూతు పోస్టులతో సామాజిక అశాంతికి కారణం అవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ సైకోల మీద పోలీసులు కేసు నమోదు చేయడమే తప్పని పేర్కొంటూ ఆ మేరకు పిల్ తో హైకోర్టును ఆశ్రయించినందుకు పోలా విజయబాబుకు తల బొప్పి కట్టింది. ‘ఇదేం పిల్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇలాంటి తప్పుడు పిల్ వేసినందుకు ఏకంగా ఆయనకు యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది.
పోలా విజయబాబు గతంలో కొన్ని పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. జగన్ ప్రాపకం సంపాదించారు. మొత్తానికి జగన్ సీఎం అయిన తర్వాత.. ఆర్టీఐ కమిషనర్ గా ఒక విడత పదవిని అనుభవించారు. ఆ తర్వాత ఆయనకు అధికార భాష సంఘం అధ్యక్షుడుగా కూడా పదవిని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. బ్యాక్ టూ బ్యాక్ పదవులు దక్కేసరికి జగన్ పట్ల అపరిమిత భక్తిప్రపత్తులను కూడా పెంచుకున్నారు.
తీరా ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణంగా పరాజయం పాలయ్యాక ఆయనకు దిక్కుతోచలేదు. అయినా సరే ఆయన వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. మళ్లీ ఏదో ఒకనాటికి జగన్ సీఎం కావొచ్చు.. ఆయన పట్ల భక్తిని ప్రదర్శించడం బెటర్ అని అనుకున్నారు. సోషల్ మీడియా సైకోల గురించి రాష్ట్రమంతా గగ్గోలు అవుతుండగా.. తాను జోక్యం చేసుకుని వైసీపీ వారి వాదనకు హైకోర్టు లో పిల్ రూపం ఇచ్చారు. నిజానికి తమ సోషల్ మీడియా సైకోలను రాజకీయంగా ప్రెస్ మీట్లలో సమర్థించుకున్నారే తప్ప.. తాము చేస్తున్న పని తప్పు అని ఆ పార్టీ వారికి కూడా తెలుసు. అయితే.. పోలా విజయబాబు మాత్రం.. అసలు కేసు పెట్టడమే తప్పు అని.. ఆ మేరకు పోలీసుల్ని ఆదేశించేలా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశించాలని ఆశించారు. అయితే ఈ పిల్ పై హైకోర్టు చాలా సీరియస్ అయింది. అసభ్యకర భాషలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారికి మద్దతుగా పిల్ వేయడమా అంటూ ఆక్షేపించింది. వారు సోషల్ మీడియా ఉద్యమకారులు కాదని, వ్యవస్థీకృత విషప్రచారంతో పౌరులకు నష్టం చేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పిటిషన్ వేశారంటూ పిటిషనర్ కు యాభైవేల జరిమానా కూడా విధించింది. ఆ పార్టీ నాయకులే పట్టించుకోని యాంగిల్ లో అడుగులు వేసి ఓవరాక్షన్ చేసినందుకు పోలా విజయబాబుకు తగిన శాస్తి జరిగిందని అందరూ అనుకుంటున్నారు.
ఓ పిటిషన్ వేస్తే ‘పోలా’! ఓవరాక్షన్ కు చెంపపెట్టు!!
Thursday, January 9, 2025