సజ్జలను విమర్శిస్తే కత్తి  దూస్తారంతే!?

Wednesday, January 22, 2025

జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన రోజులలో సకల శాఖల మంత్రిగా తిరుగులేని కీర్తిని సంపాదించుకున్న నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి! ప్రభుత్వంలో ప్రతి శాఖకు ఒక మంత్రి ఉన్నప్పటికీ అన్ని శాఖలకు సంబంధించిన అన్ని నిర్ణయాలను సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే తీసుకుంటారని, ఆయా శాఖల మంత్రులు సంతకాలు పెట్టి స్టాంపు వేయడం వరకు మాత్రమే పరిమితమని అప్పట్లో తాడేపల్లి నుంచి గుసగుసలు వినిపించేవి. నిజం చెప్పాలంటే ఇంచుమించుగా సీఎం పాత్రను కూడా సజ్జలే పోషించేవారు- అనేది కూడా అప్పట్లో వినిపించిన విమర్శ! ఆరకంగా పార్టీ పతనం కావడానికి సజ్జల ప్రధాన కారుకులని.. సొంత పార్టీ వారే అనేక సందర్భాలలో విమర్శిస్తుంటారు.

పార్టీ ఓడిపోయినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి హవా మాత్రం తిరుగులేని రీతిలో నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా అక్కడ సజ్జల లేకుండా పని జరగదు. జగన్ మాట్లాడాలని ప్రజలు కోరుకునే చాలా సందర్భాలలో సజ్జలే మాట్లాడుతుంటారు. ఇప్పటికీ కీలక నిర్ణయాలను ఆయనే తీసుకుంటూ ఉంటారు. పతనాన్ని శాసించిన వ్యక్తి ఇంకా ఇంత కీలకంగా ఉంటే ఆ పార్టీ తిరిగి ఎలా ఎదుగుతుందని పార్టీలోనిపలువురు తమలో తాము చర్చించుకుంటూ గడుపుతారు.

కాగా సజ్జలకు వ్యతిరేకంగా పార్టీలో ఎవరైనా కించిత్ గళం వినిపిస్తే వారి మీద కత్తి దూయడం తథ్యం అని ఇప్పుడు నిరూపణ అవుతోంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఇటీవల ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ పార్టీ ఓడిపోవడానికి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని అన్నారు. ఆ తర్వాత కూడా ఆ మాటలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి ఆగ్రహం వచ్చింది. కోపం వస్తే ఆయనను పిలిచి వివరణ అడగాలి.. లేదా, ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయాలి. అటు ఇటు కాకుండా మరో నిర్ణయం తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్!

పార్టీ తరఫున టీవీ చర్చా కార్యక్రమాలకు ఎవరిని పిలవాలి అనేది వారే ఒక జాబితా తయారు చేసి దాన్ని టీవీ ఛానల్స్ కు పంపారు. పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి అయిన రవిచంద్రా రెడ్డి పేరు ఆ జాబితాలో లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలు మరో 12 మంది మాత్రమే ఆ జాబితాలో ఉండడం గమనించాల్సిన సంగతి. సజ్జల మీద విమర్శ చేస్తే పార్టీలో ఎవరికీ భవిష్యత్తు లేకుండా చేస్తాం అని ఈ నిర్ణయం ద్వారా వారు నిరూపించినట్లు అయింది. పార్టీ నుంచి వెళ్ళిపోతున్న ప్రతి నాయకుడు కూడా సజ్జల వైఖరి మీదనే విమర్శలు చేస్తుండగా .. పార్టీ మాత్రం ఆయనకు ఇంకా ఆపరిమిత ప్రాధాన్యం ఇస్తుండడం గురించి అంతర్గతంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles