కొంత మంది నాయకులకు ప్రెస్ మీట్ పెట్టాలంటే జంకు. విలేకరులు ప్రశ్నలు అడుగుతారని భయం. కేవలం ట్విటర్ లో మాత్రమే తమ అభిప్రాయాలు చెబుతుంటారు. అభిప్రాయాలను వీడియోలుగా మాత్రమే విడుదల చేస్తుంటారు. ప్రెస్ మీట్ రూపంలో మాట్లాడరు. అలా పెట్టినా కూడా.. తాము చెప్పదలచుకుంది చెప్పేయగానే.. అర్జంటు పని ఉందని వెళ్లిపోతుంటారు. కానీ ఎన్నికల సీజన్లో అలా కుదరదు కదా.. ప్రెస్ తో అవసరం ఉంటుంది కాబట్టి.. ప్రెస్ మీట్ లు నిర్వహించాల్సిందే. అయితే.. వాళ్లు ప్రశ్నలు అడిగితే మాత్రం.. అసలే అలవాటు లేక, సమాధానాలు చెప్పలేక పలాయనం చిత్తగించేస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా బరిలో ఉన్న ఆయన కందుకూరులో ప్రచారానికి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు.
రాళ్లపాడు ఎడమకాలవు, ఉత్తర బైపాస్ వంటి పనులు చేసేస్తామని చాలా ఆడంబరంగా హామీ ఇచ్చేశారు. అయితే అక్కడి విలేకరులు విని ఊరుకోలేదు. దాదాపు రెండేళ్ల కిందట రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కూడా ఇవే హామీలు చెప్పారని, తక్షణం వాటికి నిధులు మంజూరు చేస్తున్నట్టు కూడా చెప్పారని.. రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదని వారు అడిగారు.
దాంతో తడబడిన విజయసాయిరెడ్డి.. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినంత మాత్రాన వెంటనే జరగాలని లేదు కదా. విఠలాచార్య సినిమాలో మాదిరిగా మంత్రదండంతో అభివృద్ధి పనులు చేయలేం కదా.. ప్రాధాన్యాన్ని బట్టి చేస్తుంటాం.. అని సెలవిచ్చారు. విలేకరులు మళ్లీ ప్రశ్నలు అడగడంతో.. ఆయన చిరాకు పడ్డారు. తన ప్రెస్ మీట్ ను అడ్డుకోవడానికే అక్కడి వారు వచ్చారంటూ మధ్యలో లేచి వెళ్లిపోయారు.
విఠలాచార్య సినిమాలో మాదిరిగా మంత్రదండంతో పనులు చేయలేం కదా అని చెప్పడానికి మరి హామీలు ఇవ్వడం ఎందుకు? మాకు ఓట్లు వేసి గెలిపించండి.. మీ ఖర్మానుసారంగా ఎప్పటికో ఒకప్పటికి మీకు ఇచ్చిన హామీలు పూర్తవుతాయి.. అప్పుడు ఆనందించండి.. అప్పటిదాకా అవస్థ పడండి.. అని ఒక్కమాట చెప్పేస్తే సరిపోతుంది కదా.. అనేది ప్రజల ప్రశ్నగా ఉంది. ప్రాధాన్యాన్ని బట్టి పనులు చేస్తుంటాం.. అని చెప్పడం ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ కష్టాలు వారికి ప్రధానం కాదు గానీ… విశాఖలో రుషికొండను బోడికొట్టేసి అక్కడ టూరిజం గెస్ట్ హౌస్ ల నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలను తగలేయడం ప్రథమ ప్రాధాన్యం అవుతుందా అని కూడా అడుగుతున్నారు. మరి విలేకరులను తప్పించుకుని పలాయనం చిత్తగించారు.. ఓకే! ఈ ప్రజల ప్రశ్నలకు విజయసాయి ఏం చెబుతారు?
ప్రశ్న అడిగితే చాలు.. పలాయనం చిత్తగించడమే!
Thursday, December 26, 2024