ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారథిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పార్టీ కాస్త వేగంగానే అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. పీవీఎన్ మాధవ్ ఎన్నికైన తర్వాత, ప్రమాణ స్వీకారం సందర్భంలోనే పలువురు కమల నాయకులు.. కూటమిలో చిచ్చును రాజేసే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ 5 శాతం పార్టీగా మిగిలిపోవాలనుకుంటే కుదరదని, రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ వాటా పెంచాల్సి ఉంటుందని పుల్లవిరుపు మాటలతో రెచ్చిపోయారు. ఎవరేం మాట్లాడినప్పటికీ.. పీవీఎన్ మాధవ్ చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. తొలిరోజునే ఒక చేతిలో బిజెపిజెండా, మరో చేతిలో కూటమి ఎజెండా పట్టుకుని ముందుకు సాగుతానని ఆయన చెప్పిన మాటలు ప్రభుత్వానికి క్షేమకరమైనవి.
తాజాగా పీవీఎన్ మాధవ్ పంచుకుంటున్న ఆలోచనలు.. రాష్ట్రంలో ఆ పార్టీ బలోపేతం కావడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయని ప్రజలు అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా సమావేశమైన మాధవ్.. జాతీయవాదం లేని గ్రామం, బీజేపీ వాసనలేని వీధి ఈ దేశంలోనే లేదని అన్న మాట నిజమే. దేశంలో ఏ పార్టీకైనా సరే మరింతగా బలోపేతం కావాలనే లక్ష్యం ఎప్పటికీ ఉంటుందని.. తాము అందుకు అతీతం కాదని మాధవ్ అంటున్నారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి సమైక్యంగానే పోటీచేస్తుందని.. బిజెపి బలాన్ని పెంచడానికి విడిగా పోటీచేయడం ఉపయోగపడుతుందనే నమ్మకం లేదని ఆయన అంటున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం కోసం ఢిల్లీలో పెద్దలతో లాబీయింగ్ చేసి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఏపీ బీజేపీ కృషి చేస్తుందని మాధవ్ అంటున్నారు. ఇది చాలా గొప్ప మాట. కూటమిగా మూడు పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు.. తెలుగుదేశం రాష్ట్రంలోను, బిజెపి కేంద్రంలోను స్థిరమైన బలంతో అధికారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తమ వాటాలు పెంచాలి.. మీరు బలహీనం అవుతూ, మమ్మల్ని బలోపేతం చేయాలి.. అంటూ ఒక పార్టీ మరొక పార్టీతో కీచులాడుకోకుండా.. ఇలాంటి వ్యూహంతో నడవడం రాష్ట్రానికి మేలు చేస్తుంది. మాధవ్ చెబుతున్నట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దలతో ఆయన స్వయంగా లాబీయింగ్ చేసి.. ఆ ఫలితాలను రాష్ట్రంలో చూపించగలిగితే.. ఇక ఎన్నికల్లో పోటీచేయడాలూ, రోడ్ల మీద ఉద్యమాలు చేయడాలూ, ప్రదర్శనలు, వేడుకలు నిర్వహించడాలూ లాంటి అవసరాలేమీ లేకుండానే.. ఆ పార్టీని ప్రజలు నెత్తిన పెట్టుకుని గౌరవిస్తారని ప్రజలు అంటున్నారు. రాష్ట్రప్రయోజనాల సాధనకు ఢిల్లీలో పెద్దలను ఒప్పించడమే, సాధించడమే.. రాష్ట్రంలో బిజెపి బలాన్ని విస్తరిస్తుందనే నమ్మకం అందరిలోనూ వ్యక్తమవుతోంది.
